మెదక్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తారో చెప్పాలని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం క్రిస్మస్ పండుగ, వందేళ్ల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమె మెదక్ చర్చిని సందర్శించారు. ఇన్చార్జి బిషప్ రెవరెండ్ రూబెన్ మార్క్, ప్రిసిబీటర్ ఇన్చార్జి శాంతయ్య ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ…సీఎం రేవంత్‌రెడ్డి మెదక్ చర్చికి వచ్చి పోయారు.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్, బోధన్, కోరుట్ల, మెదక్‌లో చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. ఎన్ని వందల కోట్లతో అయినా చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి ఇప్పటి వరకు దానిమీద సమీక్ష చేయకపోవడం దారుణమన్నారు. యావత్ తెలంగాణలో క్రిస్మస్ గిఫ్ట్‌లు, రంజాన్‌తోఫా, బతుకమ్మ చీరెలు ఎగ్గొట్టారని విమర్శించారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిని సందర్శించడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నానని చెప్పారు. రూ. 14 లక్షలు ఖర్చు చేసి ఈ చర్చి నిర్మాణం చేపట్టారని, పది వేల మందికి పనికి ఆహార పథకం కింద ఈ చర్చి నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిందన్నారు. ఈ చర్చిలో ప్రార్థన చేయడం మామూలు విషయం కాదన్నారు. కేసీఆర్‌కు, క్రైస్తవులకు పేగుబంధం ఉందని, ఉద్యమంలో క్రైస్తవులు పాల్గొన్నారని గుర్తు చేశారు. సీఎస్ఐ చర్చితో నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. అనంతరం చర్చి ఆవరణలో కేక్ కట్ చేశారు. ఆమె వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఎంపీపీల ఫోరం మాజీ అధ్యక్షుడు హరికృష్ణ, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, జయరాజ్, ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.