పటాన్చెరు, జూలై 1: ప్రభుత్వం వైఫల్యంతోనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ రసాయన ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ధృవ దవాఖానలో చికిత్స పొందుతున్న కార్మికులను ఆమె పరామర్శించి మీడియాతో మాట్లాడారు.
ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సిగాచీ రసాయన ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రసాయన పరిశ్రమల్లో యాజమాన్యులు భద్రత చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయన్నారు. తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమల్లో రక్షణ చర్యలు తీసుకునేందుకు, తనిఖీలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలన్నారు. కార్మికులకు అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు మృతదేహాలు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల కుటుంబాలకు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.