సిద్దిపేట, మార్చి 9: అసెంబ్లీ ఆవరణలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎమ్మెల్సీల అభ్యర్థి దేశపతి శ్రీనివాస్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు దేశపతికి మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు దేశపతి మంత్రిని కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంచి మనసున్న దేశపతికి అంతా మంచే జరగాలని, ఎమ్మెల్సీగా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం రావాలని ఆకాంక్షించారు.
గజ్వేల్ రూరల్, మార్చి 9: సీఎం కేసీఆర్ జిల్లాకు చెందిన కవి, గాయకుడు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ను శాసన మండలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దేశపతికి అభినందనల వెల్లువ కొనసాగుతున్నది. ఆయన గురువారం నామినేషన్ వేసిన సందర్భంగా పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దేశపతి శ్రీనివాస్‌ను కలిసిన వారిలో రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు చెరుకు చంద్రమోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్, మర్కుక్ మండలాల అధ్యక్షుడు బెండే మధు, మర్కుక్ కరుణాకర్‌రెడ్డి, నాయకులు రమేశ్ గౌడ్, సంతోష్‌రెడ్డి తదితరులున్నారు.