సిద్దిపేట, ఆగస్టు 11 : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేట ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో 229 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నివేళలా మీకు అండగా ఉంటానన్నారు.
ఆరు గ్యారంటీలు, అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నివర్గాలను మోసం చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ స్కీమ్‌లు సరిగ్గా అమలు కావడం లేదన్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ రైతుబంధు ఇవ్వడం లేదన్నారు.త్వరలోనే సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి చెరువు, కుంటను గోదావరి జలాలతో నింపుతామన్నారు. కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు గోదావరి జలాలు, రైలు తెచ్చామని, జిల్లా ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తుచేశారు.
నేడు సిద్దిపేట అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని,విద్యాలయాలు,రహదారులు, దవాఖానలు, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, మారెడ్డి రవీందర్‌రెడ్డి, కడవేర్గు రాజనర్సు, ముల్కల కనుకరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.