నర్సాపూర్,అక్టోబర్ 6 : కేసీఆర్ మహిళలను తోబుట్టువులుగా భావించి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారని, కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం మర్చిపోయిందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరల పంపిణీని కాంగ్రెస్ నాయకులు హేళన చేశారన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఒక్క చీర ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు చీరలు ఇస్తామని గొప్పలు చెప్పారన్నారు.
తీరా ఇప్పుడు చీరకు బదులు రూ.500 డబ్బులు ఇస్తామని చెప్పి అవి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలను విస్మరించిందన్నారు. బతుకమ్మ ఆడుకోడానికి లైట్లు ఏర్పాటు చేయలేదని, పరిశుభ్రత లేదని చాలామంది మహిళలు తమకు ఫోన్లు చేస్తున్నారని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వంద శాతం రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వానకాలం అయిపోతున్నా రైతుభరోసా ఇవ్వడం లేదన్నారు.
పెండింగ్ పింఛన్లతో పాటు రూ.4 వేలకు పింఛన్ పెంచి ఇవ్వాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలన్నా రు. అన్ని వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, జడ్పీ కో-ఆప్షన్ మాజీ మెంబర్ మన్సూర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, నాయకులు షేక్హుస్సేన్, సూరారం నర్సింహులు, యాదాగౌడ్, రింగుల ప్రసాద్, శ్రీకాంత్ పాల్గొన్నారు.