నర్సాపూర్, జనవరి20 : బీఆర్ఎస్ పార్టీ గద్దెల జోలికి వస్తే ఎవరినైనా ఈడ్చి అవతల పడేస్తామని కాంగ్రెస్‌ను ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి (MLA Sunitha Laxma Reddy) హెచ్చరించారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ జెండాలను కూల్చేస్తేనే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అని అననడం మూర్ఖత్వమని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి ఈ రెండు సంవత్సరాలలో ఎన్టీఆర్ పేరు ఎందుకు తీయలేదని ఆమె ఘాటుగా ప్రశ్నించారు.ఽ
తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో కలపడానికే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారా? అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని ప్రసంగించడం దేనికి సంకేతం? బీఆర్ఎస్ను పూర్తిగా లేకుండా చేసి తెలంగాణను ఆంధ్రాలో కలపాలని చూస్తాన్నారా? అని ఆమె ప్రశ్నలు సంధించారు.
మాజీ మంత్రి హరీష్ రావుపై సిట్ విచారణను ఎమ్మెల్యే సునితాలక్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, తప్పిదాలను ఎత్తిచూపినా హరీష్ రావుపై, కేటీఆర్‌పై ఏదో ఒక నెపంతో వారిపైన ఎంక్వైరీలు వేయడం, కమిషన్లు వేయడం, విచారణకు పిలిపించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని ఆమె మండిపడ్డారు. హరీష్ రావు బొగ్గు గనులకు సంబంధించిన విషయంపై మాట్లాడగా.. ఆ చర్చను పక్కదారి పట్టించడానికే రేవంత్ సిట్ విచారణకు తెరలేపారని ఆమె విమర్శించారు.
హైకోర్టు, సుప్రీం కోర్టు హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేశాయని, అయినా కూడా 24 గంటల సమయం ఇవ్వకుండానే రాత్రికి రాత్రి సిట్ విచారణకు ఆహ్వానించడం కక్షసాధింపు చర్యేనని ఆమె ధ్వజమెత్తారు. కాంగ్రె ప్రభుత్వానికి కనీసం న్యాయ స్థానాలపైన కూడా గౌరవం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులపై భయపడేది లేదని, ప్రభుత్వ తప్పిదాలను ఏలెత్తి చూపిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.