కొల్చారం, నవంబర్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మా రెడ్డి అన్నారు. శనివారం ఆమె మండలంలోని వరిగుంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బూతిపురం శేకులు తండ్రి వెంకాగౌడ్ దశదిన కర్మకు హాజరై వారి కుంటుంబాన్ని పరామర్శించారు. మరో నాయకుడు యాటా గోవర్ధ్దన్ ఇటీవల గుండెపోటుతో మరణించగా, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
అనంతరం గ్రామం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు రైతులు గోడును వెళ్లబోసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లు వెంట వెం టనే జరిగాయని, రైతుబంధు పైసలు పంట పెట్టుబడులకు అందేవని గుర్తుచేశారు. ఇప్పుడు ధాన్యం తెచ్చి ఇరవై రోజులు గడుస్తున్నా ఇంకా తూకం వేయడం లేదని, ధాన్యాన్ని కప్పి ఉం చేందుకు తెచ్చిన టార్పాలిన్లు కిరాయి వేలు దాటుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని రోజూ ఆరబెడుతూ కొనుగోలు కేంద్రంలోనే గడపాల్సి వస్తున్నదన్నారు.
అనంతరం వర్షానికి తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తూ జాప్యం చేస్తుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. కోత లు మొదలై నెల కావస్తున్నా ప్రభుత్వం ఇంకా రైస్‌మిల్లులు కేటాయించలేదన్నారు. గన్నీ బ్యాగులు సైతం రాలేదన్నారు. అటు మిల్లర్లకు బ్యాంకు హామీలు ఇవ్వాలని నిబంధన పెట్టడంతో వారు ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు.
గతంలో మిల్లర్లు దొడ్డురకం క్వింటాల్‌కు 68 కిలోలు ప్రభుత్వానికి ఇచ్చారని, ఇప్పుడు సన్నరకం కూడా 68 కిలోలు ఇవ్వాలని ప్రభుత్వం కోర గా, సన్నరకం క్వింటాల్‌కు 58 కిలోలు మాత్రమే వస్తుందని, తాము నష్టపోతామని మిల్లర్లు జంకుతున్నారని తెలిపారు. ఇటు సన్నాలను గుర్తించేందుకు మిషన్ ఏర్పాట్లు చేశారని, అందులో నుంచి జారిన ధాన్యాన్నే సన్నాలుగా గుర్తిస్తామంటున్నారని పేర్కొన్నారు. ఇది సన్నాలు రైతులను వడబోసి మోసం చేసే కుట్ర అని విమర్శించారు. పంట పెట్టే ముందు లేని నిబంధన ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. భేషరతుగా అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో ధాన్యం తరలించకుంటే రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చిరించారు. ఆమె వెంట ముత్యంగారి మేఘమాలాసంతోష్ కుమార్, పాశం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, ముత్యం ప్రవీణ్, గూడాల నర్సింహులు ఉన్నారు.