నర్సాపూర్, ఆగస్టు 15: శివంపేట మాజీ జెడ్పీటీసీ, తన భర్త వాకిటి లక్ష్మారెడ్డి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తానని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy) అన్నారు. ప్రజలు, కార్యకర్తల అభిమానం ఉన్నన్ని రోజులు ప్రజాసేవలో పాల్గొంటానని చెప్పారు. లక్ష్మారెడ్డి 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని కంజర్ల ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కుటుంబ సభ్యులతో పాల్గొని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రక్తదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పిలిచినా పిలువకున్నా అభిమానంతో తరలివచ్చిన కార్యకర్తలకు, మాజీ ప్రజాప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మారెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడు ఆనవాయితీగా వస్తున్న రక్తదాన శిబిరంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని వెల్లడించారు. కార్యకర్తల అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు.
అలాగే పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, నగదును అందజేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తూ, క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. రక్తదానం ప్రాణదానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. అంతకుముందు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శశిధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నియోజకవర్గ మాజీ ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.