కౌడిపల్లి, డిసెంబర్ 18: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం కౌడిపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ రాజునాయక్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ అధికారులు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆమె ఆదేశించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను తప్పకుండా ఇప్పిస్తానని సర్పంచులకు సునీతారెడ్డి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా మొదటి సర్వసభ్య సమావేశానికి హాజరైన సునీతా లక్ష్మారెడ్డికి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకులు, గజమాలతో వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కవిత అమర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సార రామాగౌడ్, పీఆర్డీ అమరేశ్వర్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.