నర్సాపూర్, డిసెంబర్ 5: కాంగ్రెస్ ప్రభు త్వం అక్రమ కేసులు పెడితే ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులాగా మారుతారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు అక్రమ అరెస్టుకు నిరసనగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆమె ఆధ్వర్యం లో రాస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలు గురించి అడిగితే ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేయ డం సిగ్గుచేటన్నారు. ప్రజాసమస్యలపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పోరాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్లోనే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయన్నారు.
లగచర్ల, మూసీ బాధితులు బీఆర్ఎస్ను ఆశ్రయించి వారి సమస్యలను మొరపెట్టుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం చెప్పినట్లు పోలీసులు వినకుండా న్యాయం, ధర్మం వైపు ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఫెండ్లీ పోలీస్‌వ్యవస్థ ఉండేదని, నేడు పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేసి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంతోష్‌రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రశేఖర్, రమణాగౌడ్, మాజీ ఎంపీపీ హరికృష్ణ, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.