వెల్దుర్తి, డిసెంబర్ 28. ప్రభుత్వం ప్రకటించిన ఆరుగ్యారెంటీ పథకాలను పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మానేపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై ఏర్పాట్లను పరిశీలించి, వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వృద్ధులు, నిరక్షరాస్యులు ఉంటారని, అలాంటి వారికి అవగాహన కల్పించి, దరఖాస్తులో వివరాలు నమోదు చేయాలన్నారు. చాలామందికి రేషన్ కార్డులు లేవని, ముందుగా వారి నుంచి రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని, మార్పులు, చేర్పుల కోసం కూడా దరఖాస్తులు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, సర్పంచ్ వెంకటలక్ష్మి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ తులసీరాం, ఆత్మకమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, జిల్లా కో-ఆప్షన్ మన్సూర్, నాయకులు సోమప్ప, స్వామి, రాజు, ప్రభు, మోహన్‌రెడ్డి, నర్సింహులు, కిష్టాగౌడ్, శ్రీనివాస్రెడ్డిసర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.
ప్రభుత్వం చేపట్టే అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని మండలంలోని మానేపల్లి, అందుగులపల్లి, హస్తాల్పూర్, నెల్లూర్ గ్రామాల్లో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను వస్తున్నానని తెలిసినా పట్టించుకోకుండా ప్రొటోకాల్‌ను మరిచి మానేపల్లిలో కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, వెల్దుర్తి తహసీల్దార్ తులసీరాంపై మండిపడ్డారు. మొదటి రోజు సమావేశం ఏర్పాటు చేసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని వినిపించి, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమం గురించి ప్రజలకు వివరించాల్సి ఉన్నప్పటికీ అలాంటిదేమీ లేకుండా తమ ఇష్టానుసారంగా కార్యక్రమాన్ని నిర్వహించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు వేరైనా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములేనని, అందరు కలిసి ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.