శివ్వంపేట, ఆగస్టు 30 : సంపూర్ణ రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శివ్వంపేటలో శుక్రవారం 51 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మండలానికి 51 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం 9నెలలు పెండింగ్‌లో పెట్టడం దుర్మార్గమన్నారు. చెక్కుల మంజూరు కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళితే గానీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇంకా దాదాపు 500 వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి మంజూరుకు సైతం కృషి చేస్తానన్నారు.
9నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. ఏకకాలంలో చేస్తామన్న రుణమాఫీ కేవలం 40శాతం మాత్రమే అయిందని, రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమానికి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్నా అనేక పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతుభరోసా, రుణమాఫీ, 24గంటల విద్యుత్ ఇవ్వకుండా నిలువునా మోసం చేస్తున్నదని మండిపడ్డారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించిందని, బ్లీచింగ్ ఫౌడర్ వేయడానికి కూడా జీపీల్లో డబ్బులు లేవన్నారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్‌భగీరథను విఫల పథకంగా చూపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇంత ఘోరమైన ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదన్నారు. శివ్వంపేట మండలంలోని తండాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అల్లీపూర్ తండా నుంచి ఫకీరాతండా వరకు రూ. కోటి 26లక్షలు, రత్నాపూర్ నుంచి చర్చితండా వరకు 70 లక్షలు, శివ్వంపేట హనుమాన్‌నగర్ నుంచి శంకర్‌తండా వరకు రూ. 2కోట్ల50లక్షలు, మొత్తం నాలుగున్నర కోట్లను విడుదల చేస్తే, ఆ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపి అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ఎఫ్ చెక్కులు, తండాల బీటీరోడ్లకు మంజూరైన నిధులు ఇప్పించాలని ఆమె సవాల్ విసిరారు. అందరం కష్టపడి బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ చంద్రాగౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, మాజీ జడ్పీకోఆప్షన్ మన్సూర్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, రైతు సమన్వయసమితి మండలాధ్యక్షులు నాగేశ్వర్రావు, సీనియర్ నాయకులు యాదాగౌడ్, మహిపాల్‌రెడ్డి, చింతస్వామి, రాజశేఖర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.