చేర్యాల, నవంబర్ 13 : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని జాతీయ రహదారి పై లైట్లు ఎందుకు వెలగడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారులను ప్రశ్నించారు.పట్టణంలో జాతీయ రహదారి నిర్మా ణం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆయన హైవేస్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులను ఫోన్లో ప్రశ్నించారు. కొమురవెల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని చేర్యాల పట్టణానికి చేరుకున్నానని, టౌన్లో రోడ్డు మధ్యలో ఉన్న లైట్లు వెలగడం లేదని, దీంతో చేర్యాల చీకట్లో ఉందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
జాతీయ రహదారి నిర్మాణం వల్ల గాంధీ సెంటర్ వద్ద రెండు వీధులు, చేర్యాల,నాగపురి రహదారి సైతం మూసుకుపోతున్నదని, వీధుల ప్రజలతో పాటు ఆయా గ్రామాల జనాలకు ఏవిధంగా రోడ్డు వసతి కల్పిస్తారని ప్రశ్నించారు. వీధి దీపాలు వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని, రోడ్డు విస్తరణలో భాగంగా గాంధీ సెంటర్ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద విపరీతంగా దుమ్ము లేస్తుండటంతో షాపుల నిర్వాహకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనికి స్పందించిన అధికారులు వెంటనే వీధి దీపాలు వెలిగిస్తామని, మూసుకుపోతున్న వీధులకు అప్రోచ్ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు.నిర్మాణ పనుల ప్రాంతాల్లో నిత్యం నీటిని చల్లిస్తామని ఎమ్మెల్యేకు తెలియజేశారు.