మెదక్ మున్సిపాలిటీ, జూన్ 16: సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె, పట్టణ ప్రగతి అని, పల్లె, పట్టణ ప్రగతితోనే గుణాత్మక మార్పులు సంభవిస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ర్టావిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మాయా గార్డెన్లో పల్లె, పట్టణ ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే దేశం సుభీక్షంగా ఉంటుందని సీఎం కేసీఆర్ మదిలో మెదిలిన ఆలోచన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు అంకుఠిత దీక్షతో పనిచేయడంతోనే నేడు గ్రామాలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో పరిఢవిల్లుతున్నాయన్నారు. ఒకప్పుడు పల్లెల్లో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. నేడు పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల తపనతో పని చేయడంతోనే పల్లెల్లో గుణాత్మక మార్పులు వచ్చాయన్నారు.
ప్రతి పంచాయతీలో డంప్ యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ వంటివి అందించి పరిశుభ్రతకు పెద్ద పీట వేశామన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా నేడు పల్లెలు సమృద్ధి సాధించాయన్నారు. భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించేందుకు పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టామన్నారు. పట్టణాల్లో పరిశుభ్రతకు పారిశుధ్య కార్మికులను అధిక సంఖ్యలో నియమించుకోవడంతో పాటు చెత్త సేకరణ వాహనాలను ప్రభుత్వం సమకూర్చిందన్నారు. టీఎస్ బీపాస్‌తో తక్షణమే భవన నిర్మాణాలకు అనుమతులిస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తున్నామన్నారు. జిల్లాలో సీఎం పర్యటన ఉంటుందని జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు అభివృద్ధి నిధులు కోరతామన్నారు.
జిల్లా కేంద్రంలో మానవహారం
తెలంగాణ ఆవతరణ దశాభ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో మున్సిపల్ స్వచ్ఛ వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రాందాస్ చౌరస్తాలో పాలకవర్గం, పారిశుధ్య కార్మికులు, అధికారులతో కలిసి తెలంగాణ పటం రూపంలో మానవహారం నిర్వహంచారు. తదనంతరం మున్సిపల్ కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించి ఉత్తమ సేవలందించిన పారిశుధ్య కార్మికులకు, ఉత్తమ కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కమిషనర్ జానకిరామ్‌సాగర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఉత్తమ సేవలకు సన్మానం
ఉత్తమ సేవలందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులను జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. పల్లె, పట్టణ ప్రగతి నివేదికలను ఆవిష్కరించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఉత్తమ మున్సిపల్ చైర్మన్‌గా తూప్రాన్ చైర్మన్ బొంది రవీందర్‌గౌడ్ ఎంపికయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మధన్‌రెడ్డి, కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేశారు.
జిల్లాలో ఉత్తమ సర్పంచ్‌లు
జిల్లాలో ఉత్తమ సర్పంచ్‌లుగా మెదక్ మండలం బాలనగర్ సర్పంచ్ వికాస్కుమార్, శంకరంపేట (ఆర్) సర్పంచ్ యాదగిరి యాదవ్, హవేళీఘనపూర్ మండలం తొగిట సర్పంచ్ శ్రీహరి, పాపన్నపేట మండలం కొత్తపల్లి సర్పంచ్ జయంతన్, రేగోడ్ మండలం టీ తిమ్మాయిపల్లి సర్పంచ్ సుమలత, కౌడిపల్లి మండలం ధర్మసాగర్ సర్పంచ్ ఆశమ్మ, కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి సర్పంచ్ సువర్ణ, చిలిపిచెడ్ మండలం చిట్కూల్ సర్పంచ్ గోపాల్‌రెడ్డి, వెల్దుర్తి సర్పంచ్ భాగ్యలక్ష్మి, తూప్రాన్ మండలం యావపూర్ సర్పంచ్ నర్సింహరెడ్డి, చేగుంట మండలం రుక్మాపూర్ సర్పంచ్ స్వప్న ఎంపికయ్యారు.
ఉత్తమ పంచాయతీ కార్యదర్శులు
ఉత్తమ పంచాయతీ కార్యదర్శులుగా చిన్న శంకరంపేట మండలం సురారం పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, టేక్మాల్ మండలం మల్కాపూర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి అనిత, కౌడిపల్లి మండలం ధర్మసాగర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, శివ్వంపేట మండలం శభాష్‌పల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి వీణ, నార్సింగి మండలం వల్లూర్ పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి, మనోహరాబాద్ మండలం కుచారం పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి ఉత్తమ కార్యదర్శులుగా ఎంపికయ్యారు. ఉత్తమ పంచాయతీ ఆధికారులుగా మెదక్ మండలానికి చెందిన ప్రశాంత్, శివ్వంపేట మండల అధికారి తిరుపతిరెడ్డి, నార్సింగి మండల అధికారి సతీశ్ ఎంపికయ్యారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని మెదక్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను సవరణలు చేస్తూ బాధ్యతలు ఫిక్స్ చేసినందున ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం పెరిగి సమన్వయంతో చక్కటి ప్రణాళికతో పనిచేస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందన్నారు.
– మెదక్ కలెక్టర్ రాజర్షిషా
మేధావులతో చర్చించి పల్లె, పట్టణ ప్రగతి
సమస్యల్లేని గ్రామాలుగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మేధావులతో చర్చించిన అనంతరం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారని నర్సపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. నేడు పల్లెల్లో జవాబుదారీతనం, పోటీతత్వం పెరిగిందని, ఒక గ్రామాన్ని మించి మరో గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధికి బండి చక్రాలుగా నిరంతరం శ్రమిస్తున్నందునే పల్లెలు అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తున్నాయన్నారు. అభివృద్ధిపై 90 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. నేడు పల్లెలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నదన్నారు. ఇది నిరంతరం ప్రక్రియ అని, ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
– నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి