చిన్నశంకరంపేట, అక్టోబర్ 7: ఆడబిడ్డగా మరోసారి మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం మండలంలోని ఖాజాపూర్‌లో ఆరోగ్య ఉప కేంద్రం భవనం, ముదిరాజ్ భవనం, గొల్లకురుమ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మీర్జాపల్లిలో పంచాయతీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా సమాక్య భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఓడిన గెలిచిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దారన్నారు. కాంగ్రెస్, టీడీపీలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గతంలో కరెంట్, ఎరువులు, విత్తనాల కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారని, ఇప్పుడు రైతులకు ఆ పరిస్థితి లేదన్నారు. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ 24గంటల ఉచిత కరెంటు అందిస్తున్నారన్నారు.
రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు అమలుచేస్తున్నారన్నారు. ఆడపిల్లల పెళ్లిలకు మేనమామలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో రూ.లక్షా 116 అందిస్తున్నారన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారన్నారు. గతంలో ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హనుమంతరావు నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలకు దూరంగా ఉండి ఓట్ల సమయంలో వచ్చి ఓట్లడిగితే ఎలా వేస్తారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతులకు ఉచిత కరెంటు, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ రమణ, సర్పంచ్‌లు, కుంట నాగలక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి, మీనా లక్ష్మణ్, ఎంపీటీసీ యాదగిరి సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కుమార్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, నరేశ్ ఉపేందర్‌రెడ్డి, బాగారెడ్డి, ప్రభాకర్, శ్రీను, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పూలపల్లి యాదగిరి యాదవ్, సర్పంచ్ పోచయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.