మెదక్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : తనకు రాజకీయ ఓనమాలు నేర్పించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని, సీఎం కేసీఆర్ హయాంలోనే మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పాటైందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లాకేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 2001లో తెలంగాణ ఉద్యమం సమయంలో తనకు సీఎం కేసీఆర్ రామాయంపేట జడ్పీటీసీగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమ సయమంలో కేసీఆర్ వెం ట నడిచానని గుర్తుచేశారు. అనంతరం 2004లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, ఆ తర్వాత 2014లో, 2018, 2023లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఈ స్థానంలో ఉంచారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు.
ఇన్ని అవకాశాలు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనాలు తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను విన్నవించగా, 2016 జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేశారని చెప్పారు. సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలు నిర్మించారన్నారు. ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చారని పేర్కొన్నారు. ఘనపూర్ ఆనకట్టు కోసం రూ.100 కోట్లు మంజూరు చేశారని, ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాళ్ల పనుల కోసం నిధులు మంజూరు చేయగా, వాటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రెండు పంటలు పండించేలా రైతులకు సాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. ఘనపూర్ ఆనకట్ట కింద 40వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారే తప్పా చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మెదక్‌కు రైల్వేలైన్ మంజూరు చేశారని, పనులు పూర్తయి మెతుకు సీమలో రైలు నడుస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను..
తనకు ఇంతటి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయనని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించిన సీఎం కేసీఆర్ మాటను నిలబెడతానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వారి దరి చేరేలా చూస్తానని పేర్కొన్నారు.