మెదక్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మెదక్ జిల్లాలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మరో 15 రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 480 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. మెదక్ జిల్లాలో ఈ వానకాలంలో 2,97,399 ఎకరాల్లో వరి సాగైంది. అందులో 1,04,974 ఎకరాల్లో సన్నరకం వరి, 1,93,365 ఎకరాల్లో దొడ్డురకం వరి సాగైనట్లు అధికారులు తెలిపారు.
మెదక్ జిల్లాలో 2,97,339 ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో దొడ్డురకం 5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, సన్నరకం 2.30 లక్షల మెట్రిక్ టన్నుల మేర వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లయ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయనున్నారు. ప్రతి సీజన్లో రైతులు తమ ఇంటి అవసరాల కోసం వానకాలంలో సన్నరకం వడ్ల ను వాడుకుంటారు.
బహిరంగ మార్కెట్లో రెండేండ్ల నుంచి సన్నరకం ధాన్యానికి మంచి ధర ఉండడంతో మిల్లులు, బహిరంగ మార్కెట్లకు రైతులు ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఈసారి ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం వచ్చే అవకాశం ఉంది. దొడ్డురకం 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. ఆ మేరకు సేకరణకు సివిల్ సప్లయ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
మెదక్ జిల్లాలో ధాన్యం సేకరణకు కోటి గన్నీ బస్తాలు అవసరం ఉండగా, ప్రస్తుతం 40 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ సీజన్లో సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వనున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 93 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సన్నవరి సాగు ఎక్కువగా ఉన్న మండలాల్లో మరికొన్ని సెంటర్లు పెంచే అవకాశం ఉంది. సన్నధాన్యాన్ని గుర్తించేందుకు అందుబాటులోకి మిషన్ వచ్చింది. దీంతో పాటు మరో రెండు మిషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
వానకాలం సీజన్ ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండాఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 480 కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందులో 93 కేం ద్రాల్లో సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఈ సీజన్లో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వే శాం. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచుతాం. దళారులను నమ్మి మోసపోవద్దు.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోకే రైతులు ధాన్యాన్ని తరలించి మద్దతు ధర పొందాలి.
– హరికృష్ణ, సివిల్ సప్లయ్ డీఎం, మెదక్