మెదక్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని హవేళీఘనపూర్ మండలంలో బూర్గుపల్లి, వాడి, రాజ్పేట్ గ్రామాల్లో గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఆయన వెంట మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు. వరద ఉధృతికి ఆటోలో కొట్టుకుపోయి ఇద్దరు మరణించడం బాధాకరమని ఆయన అన్నారు.
గంటల పాటు ఎదురుచూసినా సాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇద్దరు గల్లంతై ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలో కొట్టుకుపోయి చనిపోయిన సత్యనారాయణ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబీలను ఓదార్చి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
రాజుపేటకు చెందిన సత్యనారాయణ, యాదాగౌడ్ ఆటోలో మెదక్‌లోని వారి పిల్లలను తీసుకురావడానికి వెళ్లి, మార్గమధ్యలో నక్కవాగు వరద ఉధృతిలో కొట్టుకుపోయి కరెంటు స్తంభాన్ని పట్టుకుని సాయం కోసం నాలుగు గంటల పాటు వేడుకున్నా, జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. హెలికాప్టర్ లేదా ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా వాళ్లను కాపాడే ప్రయత్నం చేయకపోవడంతో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అన్నారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
నిజాంసాగర్‌కు వచ్చిన వరద ఉధృతిని గేట్ల ద్వారా ఎత్తి దిగువకు వదిలేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌తో చలా గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగిందన్నారు. వాడి గ్రామం నుంచి రాజపేట వరకు మార్గమధ్యలో రోడ్డు ధ్వంసమైందని, కరెంటు స్తంభాలు విరిగి రోడ్లపై పడ్డాయని, ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రివ్యూ పెట్టి పరిస్థితిని కనుకోవాల్సింది పోయి, మూసీ నది సుందరీకరణపై రివ్యూ పెట్టడంపై హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెకలేకుండా పోయాయని విమర్శించారు.
రెండు రోజులుగా హవేళీఘన్‌పూర్ మండలంలో ఐదు గ్రామాలకు విద్యుత్, తాగునీరు సరఫరా లేదన్నారు. వీళ్లకు కనీసం తిండి, నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉందని హరీశ్‌రావు విమర్శించారు. సీఎం, మంత్రులు తిరగడానికి హెలికాప్టర్ వస్తుంది కానీ, ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్ రాకపోవడం దురదృష్టకరమని హరీశ్‌రావు అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ. 25వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వరదలో చనిపోయిన సత్యనారాయణ, యాదాగౌడ్ కుటుంబానికి చెరో రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దూప్‌సింగ్ తండా ప్రజలు రెండు రోజులు నీటిలోనే ఉన్నారని, వారికి తాగునీరు, తిండి, అన్ని వసతులు కల్పించాలన్నారు. యాదాగౌడ్ మృతదేహాన్ని వెతికించి కుటుంబీకులకు అప్పగించాలని హరీశ్‌రావు కోరారు. ఆయన వెంగ మాజీ సర్పంచ్ చెన్నా గౌడ్, యామి రెడ్డి, సాయ గౌడ్, నాయకులు భిక్షపతి రెడ్డి, హన్మంత్ రెడ్డి, సిద్దిరాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాపసాయిలు, శ్రీనివాస్, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ గంగ నరేందర్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.