సిద్దిపేట, నవంబర్ 29: చదువుకు పేదరికం అడ్డుకావద్దని, నియోజకవర్గంలో వైద్యవిద్య చదివే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఆయన హాజరై తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. విద్యార్థులు సమాజాన్ని మార్చే సామాజిక వేత్తలుగా ఎదగాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చిన విద్యార్థులకు ఫీజు తానే చెల్లిస్తానన్నారు. ఫీజు తన బాధ్య త… డాక్టర్ అయ్యేది మీ బాధ్యత అని ఆయ న పేర్కొన్నారు.
బాసర ట్రిఫుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు ట్యాబ్ గిఫ్ట్‌గా ఇస్తానన్నారు. అన్నింటిలో సిద్దిపేట ఆదర్శమని.. సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రంలో 1733 ప్రదర్శనలు చేసిన జిల్లాగా సిద్దిపేట నంబర్ వన్‌గా నిలవడం సంతోషంగా ఉంద ని హరీశ్‌రావు పేర్కొన్నారు. సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని, ఒక్కో విద్యార్థిలో ఒకో శాస్త్రవేత్త తనకు కనిపించారని అభినందించారు. ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రదర్శనలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులు సోషల్ మీడియాకు , ఫోన్లు, డ్రగ్స్‌కు దూరంగా ఉండి బాగా చదువుకోవాలని సూచించారు. వంద రోజుల్లో పదో తరగతి పరీక్షలు ఉన్నాయని, ఇప్పటి నుంచే టీవీలు, ఫంక్షన్లు, ఫోన్లు బంద్ చేయాలన్నారు. 10/10 సాధించిన విద్యార్థులకు బహుమతి ఇస్తానని హామీ ఇచ్చారు. వైద్య విద్యకు ఎకువగా బాలికలు ఆసక్తి చూపుతున్నారన్నారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేసీఆర్ కల్పించారని గుర్తుచేశారు. అందరూ అన్ని రంగాల్లో రాణించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.