నిజాంపేట, మార్చి 31: అబద్దపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువు వచ్చిందని, కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నిజాంపేటలోని రేణుకా ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ నీళ్లు, కరెంట్ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణలో కరువు తండావిస్తున్నదన్నారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తానన్నా ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని ధ్వజమెత్తారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రూణమాఫీ అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అన్నదాతలను పూర్తిగా ఆగం చేసిందన్నారు. ఇంటికో ఎండ్ల బండి, ఎండ్లు ఇస్తానన్నా హామీతోపాటు ఎమ్మెల్యేగా గెలువడానికి అబద్ధపు హామీలు ప్రకటించిన రఘునందన్‌రావు గెలిచినంక ఏ ఒక్కటీ నేరవేర్చలేదన్నారు. దీంతో దుబ్బాక ప్రజలు 57 వేల ఓట్ల మెజార్టీతో కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకుని తగిన గుణపాఠం చెప్పారన్నారు. రఘునందన్‌రావు మాయమాటలను ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. వరి వేస్తే రూ.500 బోనస్ ఇస్తునన్నా రేవంత్‌రెడ్డి మాటలు బోగాస్గా మిగిలాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
సమావేశంలో హారీశ్‌రావు మాట్లాడుతుండానే కరెంట్ పోయింది. ఈ విషయం తెలుసుకున్న ఫంక్షన్ హాల్ సిబ్బంది వెంటనే జనరేటర్‌ను ఆన్ చేసి సమావేశం అయ్యే వరకు కొనసాగించారు.
* బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి
ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకుండా రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ సైనికులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తిరుపతిరెడ్డి, ఎంపీపీ సిద్ధిరాములు, వైస్ ఎంపీపీ అందె ఇందిరా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు బాల్‌రెడ్డి, సురేశ్, పీఏసీఎస్ చైర్మన్లు కొండల్‌రెడ్డి, బాపురెడ్డి, కోఆప్షన్ సభ్యుడు గౌస్, గ్రామాధ్యక్షుడు నాగరాజు, కార్యకర్తలు ఉన్నారు.