సంగారెడ్డి, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): ఫార్మాసిటీ పేరుతో పచ్చని పొలాలను కాలుష్య కాసారాలుగా మార్చాలన్న రేవంత్ సర్కార్ కుట్రలపై ఇటీవల వికారాబాద్ రైతులు తిరుగుబాటు చేయటం సంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియాలో రైతుల ఆందోళన దృశ్యాలను సంగారెడ్డి జిల్లాలోని డప్పూరు, వడ్డీ, మాల్గి గ్రామాల రైతులు పరిశీలించారు. రేవంత్ సర్కార్ న్యాల్కల్ మండలంలోనూ ఫార్మాసిటీ ఏర్పాటుకు భూసేకరణ మొదలుపెట్టడమే ఇందుకు కారణం. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా వడ్డి, డప్పూరు, మాల్గి గ్రామాల రైతులు రెండు నెలలకుపైగా ఆందోళనలు చేస్తున్నారు. సీఎం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భూములు కోల్పోతున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మండలంలోని డప్పూరు, వడ్డీ, మాల్గి గ్రామాల్లో ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం రెండువేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని రైతులు పోరా టం చేస్తున్నారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను ఫార్మాసిటీ కోసం ఇచ్చేది లేదని రైతులు తెగేసిచెబుతున్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో జల, వాయు కాలు ష్యం పెరిగి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా న్యాల్కల్ మండలంలో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించటంతోపాటు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
మాజీమంత్రి హరీశ్‌రావు గతనెల డప్పూరులో పర్యటించి రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లా డి రైతుల సమస్యలు తెలుసుకోవటంతోపాటు ప్రభుత్వం సేకరించనున్న భూములను పరిశీలించారు. ఆందోళనలో పాల్గొన్న హరీశ్‌రావు రేవంత్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాటం చేస్తూనే గ్రీన్ ట్రిబ్యునల్‌ను, హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. దీంతో భూసేకరణ కొనసాగడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఫార్మాసిటీ కోసం గ్రామసభలు నిర్వహించటం, రైతులు తిరగుబాటు చేయటం న్యాల్కల్ మండలం రైతుల్లో చర్చనీయాంశంగా మారింది. సొంత జిల్లా రైతుల తిరుగుబాటును గుర్తించి రేవంత్ సర్కార్ న్యాల్కల్లో ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.