సిద్దిపేట అర్బన్, మే 11: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల వైఫల్యంపై ప్రజలు గరంగరంగా ఉన్నారు. వారు చేసిన మోసాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ ఎన్నికలు అవకాశం కల్పించాయని, ఎన్నికల్లో రైతులు, మహిళలు, వృద్ధులు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించబోతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేటలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోలు ఉద్యమం నాటి రోజులను గుర్తు చేశాయన్నారు.
ప్రజలు కేసీఆర్ సభకు ఎండలను సైతం లెక్కచేయకుండా నీరాజనం పట్టారన్నారు. కేసీఆర్ సభలకు ప్రజల నుంచి ముఖ్యంగా మహిళలు, యువత నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ సభలు జనంలేక వెలవెలబోయాయన్నారు. సిద్దిపేటలో జరిగిన అమిత్ షా సమావేశంలో జనం లేక కేవలం 7 నిమిషాల్లోనే మాట్లాడి ముగించారన్నారు. రాహుల్ గాంధీ సరూర్‌నగర్ మీటింగ్‌లో జనంలేక స్వయంగా రేవంత్‌రెడ్డే వెళ్లి ఆహ్వానించే పరిస్థితి ఏర్పడిందన్నారు. మూడు పార్లమెంట్ల సమావేశాలు ఏర్పాటు చేస్తే రాహుల్‌గాంధీ మూడు నిమిషాల్లోనే ముగించుకొని పోయిన పరిస్థితి ఉందన్నారు. పటాన్చెరులో కేసీఆర్ సభ పెడితే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. అదే స్థలంలో రేవంత్‌రెడ్డి సభ పెడితే 25శాతం మంది కూడా రాక గ్రౌండ్ అంతా ఖాళీగా ఉన్నదన్నారు.
చెక్ బౌన్స్ అయితే శిక్ష పడ్డట్టు..బౌండ్ పేపర్ బౌన్స్ కావడంతో శిక్ష వేయాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ తమ గురించి బలంగా కొట్లాడాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రజలు రుచించడం లేదన్నారు. తెలంగాణ వాణి, తెలంగాణ బాణి పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలనే భావన వినిపిస్తుందన్నారు.
తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రజలు భావిస్తున్నారని.. మిషన్ భగీరథకు, మెడికల్ కళాశాల మంజూరు చేయడంలో, సాగు నీటి ప్రాజెక్ట్‌ల్లో, మిషన్ కాకతీయకు నిధులు అందజేయడంలో బీజేపీ సవతితల్లి ప్రేమ చూపిందన్నారు. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్దీ ధాన్యం పండితే.. కాంగ్రెస్ హయాంలో పుట్టెడు కష్టాలు వచ్చాయన్నారు. అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెసోళ్లకు ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధమైనట్లు హరీశ్‌రావు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీలు బోగస్ సర్వేలతో బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ప్రజల ఆదరణను ఆపలేక పోయారన్నారు. ప్రజలు కేసీఆర్‌కు అపూర్వ రీతిలో స్వాగతం పలికారని చెప్పారు. ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ఇతర పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్నందున బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్కు పూర్వ వైభవం రాబోతుందని.. తెలంగాణ ప్రజలకు కచ్చితమైన గ్యారెంటీ బీఆర్ఎస్ మాత్రమేనని.. కేసీఆర్ గ్యారెంటీ తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు.
రిజర్వేషన్లపై మాట్లాడే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్లలో, క్యాబినేట్ కూర్పులో ఏ రిజర్వేషన్లు అమలు చేశారో చెప్పాలన్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. మూడు ఎస్సీ రిజర్వ్డు టికెట్లలో ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదని.. వారికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు మాదిగలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు.
ప్రధానమైన సామాజిక వర్గాలకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని.. బీసీలకు అత్యధిక టికెట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు.వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీగా ఉండగా.. ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారని, మరీ జగిత్యాలలో ఓడిపోయిన ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డికి నిజామాబాద్‌లో ఎందుకు టికెట్ ఇచ్చారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌కు టికెట్ ఇస్తే ఒప్పు.. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే తప్పా అన్నారు. పూటకో మాట మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి విశ్వసనీయత కోల్పోయారన్నారు.
మెదక్‌లో బీజేపీ అభ్యర్థి జిమ్మిక్కులు చేస్తాడని, గత దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటింగ్ ప్రారంభమయ్యే ముందు ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజల్లో గందరగోళం సష్టించారని హరీస్‌రావు అన్నారు. ఇప్పటికే అలాంటి వీడియోలు తయారు చేశారని, తమకు సమాచారం ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెసోళ్ల సోషల్ మీడియాలో పంపించే ఫేక్ వీడియోలను ప్రజలు గుడ్డిగా నమ్మవద్దని.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలన్నారు.
వెంకట్రామ్రెడ్డి విద్యావంతుడు. 22 ఏండ్ల నుంచి ఈ జిల్లాతో అనుబంధం, అవగాహన ఉన్నదన్నారు. గెలిచిన తర్వాత ట్రస్ట్ సేవలు కచ్చితంగా కొనసాగిస్తానని కుటుంబంపై ప్రమాణం చేశాడన్నారు. వెంకట్రామిరెడ్డిని ఆశీర్వదిస్తే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను, సిద్దిపేటలో తనను ఆశీర్వదించినట్టే అన్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వేణుగోపాల్‌రెడ్డి, భూపేశ్, నాయకులు ఉన్నారు.
మోదీ మాటల్లో నీతి, రేవంత్‌రెడ్డి ప్రవర్తనలో రీతి లేదన్నారు. రేవంత్‌రెడ్డి ఎప్పుడైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. అమరవీరుల స్తూపం వద్ద ఏనాడూ రెండు పువ్వులు కూడా పెట్టలేదన్నారు. జిల్లాలు రద్దు చేస్తానని. చార్మినార్, కాకతీయ తోరణం చిహ్నం నుంచి తొలిగిస్తామని మాట్లాడడం విడ్డూరమన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం అంబేద్కర్ జయంతి రోజు ఒక పూలదండ వేయకుండా అవమానపర్చారన్నారు.
చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఆంధ్రప్రదేశ్‌లో పది ఎకరాలు కొనవచ్చని చెప్పాడని, కానీ కాంగ్రెస్ పాలనలో పాలన రివర్సై భూముల ధరలు పడిపోయాయన్నారు. పదేండ్లలో కేసీఆర్ 50 ఏండ్ల అభివృద్ధి చూపిస్తే.. 5 నెలల్లోనే కాంగ్రెస్ 5 ఏండ్ల వెనక్కి తీసుకుపోయిందన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే.. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే.. పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినబడాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.