సిద్దిపేట, ఏప్రిల్ 13: యువత, విద్యార్థులు గులాబీ జెండాకు గుండెకాయలాంటి వారని, సిద్దిపేట నుంచి పార్టీ రజతోత్సవ సభకు వెయ్యిమంది యువత, విద్యార్థులు పాదయాత్రగా తరలుదామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో యువత, విద్యార్థి సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సిద్దిపేట నుంచి చేసే పాదయాత్ర సిద్దిపేట 25 ఏండ్ల గులాబీ జెండాకు స్ఫూర్తి అన్నారు. కాంగ్రెస్ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంతా బోగస్ అని ఆయన విమర్శించారు. 6వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా 55 వేలు భర్తీ చేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసిన కాంగ్రె స్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపి నిరుద్యోగులను ఎన్నికల ముందు వాడుకొని వదిలేసిందన్నారు.
గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగుల గుండెల మీద తన్నుతున్నదని అన్నారు. ఆనాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరామ్, రియాజ్, బల్మూరి వెంకట్, మురళి, రేవంత్‌రెడ్డి తదితరులు అశోక్‌నగర్‌లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారని, బస్సు యాత్రలు చేశారని, రాహుల్ గాంధీని అశోక్‌నగర్‌కు తీసుకువచ్చి ప్రామిస్‌లు చేయించారన్నారు. వీరికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయని, నిరుద్యోగులకు మాత్రం రాలేదని హరీశ్‌రావు అన్నారు.
రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఏడాదిన్నర పూర్తయిందని, ఎందుకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి నిరుద్యోగుల బాధలు కనపడడం లేదా, వినపడడం లేదా అన్నారు. నిరుద్యోగ భృతి ఉట్టి మాటే అన్నారు.
రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని హరీశ్‌రావు కోరారు. సమావేశంలో బీఆర్ఎస్వీ యువజన విభా గం నియోజకవర్గ అధ్యక్షుడు నిమ్మ రజనీకాంత్‌రెడ్డి, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డి యాదగిరి, విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు మహిపాల్‌గౌడ్, బీఆర్ఎస్వీ మాజీ అధ్యక్షుడు మెరుగు మహేశ్, నాయకులు భానుచందర్‌గౌడ్, రవి, గుజ్జ రాజు, వేణు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.