సంగారెడ్డి సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి మెడికల్ కాలేజీ క్రెడిట్ దక్కించుకోవాలన్న కాంగ్రెస్ ఆశలకు గండిపడింది. సీఎం రేవంత్‌రెడ్డిని సంగారెడ్డికి రప్పించి ఆయన చేతుల మీదుగా సంగారెడ్డి మెడికల్ కాలేజీ భవనాలను ప్రారంభింపజేసి క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అనుకున్నారు. అందుకు అనుగుణంగా గురువారం సీఎం చేతుల మీదుగా మెడికల్ కాలేజీ భవన ప్రారంభోత్సవాలు చేయించేందుకు సిద్ధమయ్యారు.
జిల్లాకు చెందిన ముఖ్యమైన నేతలు, ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సంగారెడ్డికి రావాల్సిందిగా ఆహ్వానం పలికినట్లు తెలుస్తుంది. ఈనెల 4 లేదా 8వ తేదీల మధ్య సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు రావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డికి వచ్చేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. సంగారెడ్డి మెడికల్ కాలేజీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరుకావడంతోపాటు ఇది వరకే కేసీఆర్ మెడికల్ కాలేజీని ప్రారంభించిన నేపథ్యంలో మరోసారి ప్రారంభించేందుకు సీఎం అంగీకరించలేదని తెలుస్తుం ది.
జిల్లాకు చెందిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ భవనాలను ప్రారంభింపజేసుకోవాలని రేవంత్‌రెడ్డి జిల్లా ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులకు సూచించినట్లు సమాచారం. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి లేకుండానే మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా సంగారెడ్డి మెడికల్ కాలేజీ రెండో విడతలో నిర్మించిన మెడికల్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవం జరిగింది. 500 పడకల బోధన దవాఖానకు మంత్రి దామోదర్ శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తాడని ఆశపడిన కాంగ్రెస్ శ్రేణులకు నిరాశ ఎదురైంది.
అసహనం వ్యక్తం చేసిన దామోదర్
సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డికి రాకపోగా మెడికల్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహించాలనుకున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఆశలు సైతం నెరవేరలేదు. మంత్రి దామోదర్ మెడికల్ కాలేజీ నూతన భవనాలను ప్రారంభించారు. అనంతరం మెడికల్ కాలేజీలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభం నుంచి మైక్, స్పీకర్లు సరిగ్గా పనిచేయలేదు. దీంతో కార్యక్రమానికి హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మైక్లేకుండానే ప్రసంగించగా ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, సంజీవరెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో మైక్‌లు పనిచేయక ఇబ్బంది పడ్డారు. మైక్‌లు పనిచేయకపోవడంతో మంత్రి దామోదర్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతోపాటు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి దామోదర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతున్న సమయంలో ఎంబీబీఎస్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీ విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ నూతన భవనాల ప్రారంభత్సోవంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతోపాటు కాలేజీ ఏర్పాటు కోసం కేసీఆర్ రూ.510 కోట్లు విడుదల చేశారని తెలిపారు. మంత్రి దామోదర్ చేతుల మీదుగా క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభించుకోవడం, 500 పడకల బోధన దవాఖానకు శంకుస్థాపన జరగడం సంతోషంగా ఉందన్నారు.