కంది, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి, సిబ్బందిని బండ బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలో పోలీసులపై జగ్గారెడ్డి మాట్లాడిన తీరు అవమానకరమని, ఈ అంశంపై డీజీపీ స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం సాయం త్రం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికల విధి నిర్వహణ కోసం వచ్చిన పోలీస్ అధికారులను బూతులు తిడుతూ వారిపై దాడికి ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎన్నికలు ఏవైనా సరే జగ్గారెడ్డి అక్రమాలు చేయకుండా సంగారెడ్డిలో ఎన్నికలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహస్యం చేయడం జన్మహక్కుగా వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిని అదుపు చేయడంలో అధికార వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. పోలీసులు, పోలింగ్ సిబ్బంది, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన తీరు అత్యంత బాధాకరమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జగ్గారెడ్డి అక్రమాలు, డబ్బుల పంపకాలపై ఫొటోలు, ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎందుకు కేసులు నమోదు చేయలేదని ఆయన ప్రశించారు. పోలీసులు, అధికార యంత్రాం గం జగ్గారెడ్డి పట్ల ఉదాసీనంగా ఉండటం వల్ల ఎంతనష్టం జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు.
ఇలాంటి వ్యక్తి వల్ల సంగారెడ్డి పరువు ప్రతిష్టలు మంట గలుస్తున్నాయన్నాయన్నారు. ఎన్నికల విధుల కోసం వచ్చిన అధికారులకు జగ్గారెడ్డి వల్ల అవమానం జరిగిందని, ఇందుకు సంగారెడ్డి ఎమ్మెల్యేగా, బాధ్యత గల నాయకుడిగా ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విషయంలో పోలీస్ సంఘాలు ఎలా స్పందిచాయో..ఈ విషయంలో కూడా అలాగే స్పందించాలని కోరారు. సమావేశంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి,మాజీ జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ శ్రీహరి, మందుల వరలక్ష్మి, శ్రీధర్‌రెడ్డి, మల్లాగౌడ్, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.