సంగారెడ్డి సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో కొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అలాంటి అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హెచ్చరించారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి ఆయన బుధవారం కలెక్టర్ ప్రావీణ్యను కలిసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ అందుబాటులోకి రాకపోవటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని కొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని ప్రజల సమస్యలను గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేసిందన్నారు. కేసీఆర్ మంజూరు చేసిన పనులు, నిధులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు మంజూరు చేసిన అభివృద్ధి నిధులను రద్దు చేయడం సరికాదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుండగా, అధికార యంత్రాంగం అందుకు సహకరిస్తున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు సూచించిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యేలా అధికారులు సహకరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఉద్దేశపూర్వకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఆలస్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యపై పలుమార్లు వినతులు సమర్పించినా అధికారులు స్పందించడంలేదని, సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ 40శాతం ఇండ్లు కేటాయించాలని అధికారులకు సూచించినా స్పందించడంలేదన్నారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు ఎస్డీఎఫ్ నిధులు, టీయూఎఫ్ఐడీసీ, ఎంఆర్ఆర్ నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.
మినీ హజ్‌కు రూ.2 కోట్లు, దోబీఘాట్లు, ఎంపీపీ బిల్డింగ్ పెండింగ్ నిధులు రూ.85 లక్షలు మంజూరు చేయాలని వినతులు ఇచ్చినట్లు చెప్పారు. బేంగంపేటలో పిషరీస్ బిల్డింగ్ కోసం స్థలం కేటాయించాలని, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరడం జరిగిందన్నారు. సంగారెడ్డిలోని బైపాస్‌రోడ్డు నిర్మా ణ పనుల్లో నాణ్యత లోపించిందని చెప్పినా అధికారులు స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు 40 శాతం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు విషయంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడిన మాటలు తనను ఎంతో బాధించాయని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గానికి 40 శాతం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య దృష్టికి తీసుకువెళ్లగా, 40శాతం ఇండ్లు కేటాయించాలని నిబంధనలు ఎక్కడ ఉన్నదని ప్రశ్నించిందన్నారు.
ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని అవమాన పర్చేలా కలెక్టర్ మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి 40 శాతం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశాలు ఇస్తే కలెక్టర్ ప్రావీణ్య పట్టింపులేని సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చెప్పినా కలెక్టర్ లెక్కచేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తన నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జైపాల్‌రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, చింతా సాయికుమార్, కొండల్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీధర్‌రెడ్డి, విష్ణు పాల్గొన్నారు.