అందోల్, జూన్ 15: పల్లెప్రగతితో పల్లెసీమలను పట్ణణాలుగా మార్చారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జోగిపేట పట్టణంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లను అందంగా అలంకరించి గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు మరింత చేరువయ్యేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి డీజే సౌండ్లకు అనుగుణంగా కార్యకర్తలు నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా 5కిలోమీటర్లు ట్రాక్టర్ నడిపి కార్యకర్తలో మరింత జోష్‌ను నింపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, తాలెల్మ ఎత్తిపోతల చైర్మన్ లింగాగౌడ్, వరం చైర్మన్ వీరారెడ్డి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు విజయ్‌కుమార్, వీరప్ప, శివకుమార్, నాయకులు వెంకటేశం, అనిల్‌రాజ్, రాజు, మోగులయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువుచేయాలని, లేదంటే వారి నాయకుడితో అందోల్ ప్రజలకు క్షమాపణలు చెప్పించి రాజకీయ సన్యాసం చేయించాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ సోషల్‌మీడియా వారియర్స్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగేండ్లుగా అందోల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై అవాకులు, చవాకులు పేలుతూ ఈనెల 15న జోగిపేట బస్టాండ్ వేదికగా చర్చకు సిద్ధమని ప్రకటించారన్నారు. ఈ చర్చకు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహను తీసుకువస్తామని, మీరు మీ ఎమ్మెల్యేను తీసుకురావాలంటూ కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేశారని చివరకు యువత చర్చకు రాగా….కాంగ్రెస్ నాయకులు, వారి నాయకుడు తోకముడిచారని విమర్శించారు. చేసిన అభివృద్ధిని ఎక్కడైనా చెప్పేందుకు సిద్ధమన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయం చేద్దామంటే కుదరదని, నేను తప్పు చేసినట్లు రుజువుచేస్తే రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటానన్నారు.