న్యాల్కల్, ఆగస్టు 27: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మిషన్ భగీరథ పథకం తాగునీటి సరఫరా చేసే తాత్కాలిక కార్మికులు వేతనాల కోసం ఆందోళన బాట పట్టారు. దీంతో న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. పదిరోజలుకు పైగానే ఆయా మండలాల్లోని దాదాపు 75 గ్రామాలకు మిషన్ భగీరథ పథకం కింద తాగునీరు సరఫరా నిలిచిపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా గ్రామాల్లోని తాగునీటి సరఫరా చేసే బావులు, బోర్లు బంద్ కావడంతో మిషన్ భగీరథ పథకంపైనే ప్రజలు ఆధారపడుతున్నారు.
ఆయా మం డలాలకు చాల్కి ఫిల్టర్ బెడ్ నుంచి రోజూ తాగునీరు సరఫరా అవుతున్నది. తాగునీటి సరఫరా చేసేందుకు నియమించిన తాత్కాలిక కార్మికులకు ఏడు నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదు. పలుమార్లు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు మొరపెట్టుకున్న ఫలి తం లేకుండా పోయిందని కార్మికులు వాపోతున్నారు. కార్మికుల ఆం దోళనతో ఆయా మండలాలకు తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బిందెడు నీటి కోసం గ్రామాల సమీపంలోని వ్యవసాయ పంపుసెట్లను ఆశ్రయించాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
ఈ విషయమై సంబంధిత మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా..ఆయా మండలాల్లోని ప్రజలకు తాగునీటి సరఫరా ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీటి ఇబ్బందులు ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. తాగునీటి సరఫరా చేసే ట్యాంకర్ల బిల్లులను సంబంధిత కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసి చెల్లిస్తామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ తాత్కాలిక కార్మికుల సమస్యను సంబంధిత కాంట్రాక్టర్‌తో చర్చిస్తామన్నారు.