పటాన్చెరు, ఆగస్టు 11: సంగారెడ్డి జిల్లా ముత్తంగి, ఇస్నాపూర్, చిట్కుల్ గ్రామాల్లో తాగునీరు రాక ప్రజలు పరేషాన్ అవుతున్నారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామానికి వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడంలేదు. ఇస్నాపూర్లోను వారం తర్వాత ఆదివారం తాగునీరు ప్రజలకు వదిలారు. చిట్కుల్ గ్రామంలో వారానికి ఒకరోజు మాత్రమే తాగునీరు ఇస్తున్నారు. ఇస్నాపూర్‌లో 45 వేల జనాభా, ముత్తంగి లో 25వేల జనాభా, చిట్కుల్లో 25వేల జనాభా నివసిస్తున్నారు. దాదాపు 95వేల మందికి తాగునీరు అందట్లేదు. మిషన్ భగీరథ గ్రిడ్ వైఫల్యంతో తాగునీరు ప్రజలకు వదలడం లేదు.
భూగర్భజలాలు కలుషితం కావడంతో ఇక్కడి బోరు నీటి వాడకం ప్రమాదకరం. మిషన్ భగీరథ నల్లాల్లోంచి చుక్కనీరు రాకపోవడంతో బోరు నీటినే ప్రజలు ఉపయో గిస్తున్నారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలు, ఫార్మా పరిశ్రమల కాలుష్య జలాలు భూగర్భ జలాల్లో కలిశా యి. మూడు దశాబ్దాలుగా ఇక్కడి భూగర్భ జలాలు వివిధ రంగుల్లో, దుర్వాసనతో వస్తున్నాయి. ఈ విష యంలో పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టుకు, చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి ఉచిత తాగునీరు అందజేసేలా ఆర్డర్ తెచ్చుకున్నారు. కాలుష్య పీడిత గ్రామాలుగా గ్రీన్ ట్రిబ్యునల్ గుర్తించిన ఇస్నాపూర్, ముత్తంగి, చిట్కుల్‌కు తాగునీరు అందజేయడంలో జిల్లా అధికారులు నిర్ల క్ష్యం వహిస్తున్నారు.
క్యాసారం నుంచి వచ్చే మెయిన్ లైన్, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే లైన్లు ఎప్పుడు మరమ్మతుల్లో ఉన్నాయనే సాకు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా పలు కాలనీలకు నెలకు 5 రోజులకు మించి తాగునీరు అందట్లేదు. ఇక్కడ ఎక్కువశాతం సెటిలర్లు, కార్మికులు ఉండటంతో వారి నీటి అవస్థలు బయటకు రావడం లేదు. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో ఎలా ఉంటుందో ఊహించుకుని ప్రజలు ఆందోళన చెందు తున్నారు. గ్రామసభల్లో ప్రజలు తాగునీటి కోసం అధికారులను నిలదీస్తున్నారు.
ముత్తంగి, చిట్కుల్, ఇస్నాపూర్ గ్రామాల్లో భూగర్భ జలాల్లో యాంటీబయోటిక్స్ కలిశాయని స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ కలుషిత నీటిని సేవిస్తే రోగాలు రావడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ప్రతి ఇంటా దీర్ఘకాలిక రోగులు కనిపిస్తున్నారు. రోజుకు దాదాపు కోటి లీటర్ల నీరు ఈ ప్రాంతానికి అందజేయాలి. కానీ, వారానికి కోటి లీటర్లు కూడా ఇవ్వడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా పంపిణీ చేస్తున్న నీరు సంపుల్లోకి వదులుతున్నారు.
మిషన్ భగీరథ గ్రావిటీ ద్వారా పంపిణీ చేసే పథకం. కానీ, ఇస్నాపూర్, ముత్తంగి, చిట్కుల్లో గ్రావిటీ పనిచేయడం లేదు. మోటర్ల ద్వారా సంపుల్లో ఈ నీటిని నింపుతున్నారు. అక్కడి నుంచి ట్యాంకులకు మోటార్లతో ఎక్కిస్తున్నారు. ఈ గ్రామాలకు పదుల సంఖ్యలో కాలనీలు రావడంతో ఈ కాలనీలకు తాగునీరు అందజేయడం పంచాయతీలకు తలకుమించిన భారంలా మారింది. పైనుంచి నీరు రావడం లేదని పంచాయతీ సిబ్బంది చెతులెత్తేస్తున్నారు. మిషన్ భగీరథ గ్రిడ్ నీటి పంపిణీలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. చిట్కుల్ గ్రామానికి నీటిని వదిలితే ఇస్నాపూర్‌లో నీటిని నిలుపుతున్నారు. ఆ తర్వాత ముత్తంగికి ఇస్తున్నారు. వారంలో రెండు, మూడు రోజులు ఇస్తున్న నీరు సంబంధిత గ్రామాల్లో సగం కాలనీలకు కూడా సరిపోవడం లేదు.
నిత్యం నీటిని ఇస్తేనే అన్ని కాలనీలకు నీరు అందుతుంది. ఎప్పుడు చూసినా మిషన్ భగీరథ అధికారులు కంది వద్ద పైప్‌లైన్ పగిలిందని చెబుతూ వారం రోజులకు పైనే నీటిని నిలిపేస్తున్నారు. అందులో శనివారం, ఆదివారం రోజు వస్తే అధికారుల ఫోన్లు మూగబోతున్నాయి. మొత్తంగా నెలకు 5-6 రోజులే తాగునీరు ప్రజలకు అందుతుండడం దారుణం. దిక్కులేక ప్రజలు కాలుష్య భూగర్భ జలాలే వాడుతున్నారు. ఆర్వో ప్లాంట్ల నుంచి తాగునీరు కొనుక్కుంటున్నారు. అందరి ఆరోగ్యాలను కాపాడేందుకు తెచ్చిన మిషన్ భగీరథ పథకం ఇప్పుడు ప్రజల ఆరోగ్యాలకు శాపంగా మారుతున్నది.