పటాన్చెరు, సెప్టెంబర్ 28 : జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ పైప్‌లైన్ అనేక చోట్ల పగిలిపోతున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో రింగ్‌రోడ్డు జంక్షన్ ముత్తంగి నుంచి లక్డారం గేటు వరకు మిషన్ భగీరథ విస్తరణ పనులు జరుగుతున్నాయి. విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ జేసీబీలతోజాతీయ రహదారి పక్కన తవ్వకాలు చేస్తున్నాడు. ఇటీవల తవ్వకాల్లో ముత్తంగి గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలింది.
పెద్ద ఎత్తున తాగునీరు మురుగునీటిలో కలిసింది. మరో పక్క ఆరు రోజుల క్రితం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఇస్నాపూర్ వద్ద జేసీబీ, ప్రొక్లెయినర్లతో జరిపిన తవ్వకాల్లో మిషన్ భగీరథ నీటి పైప్‌లైన్ పగిలిపోయింది. రెండు రోజులు తాగునీరు జాతీయ రహదారి పక్కనుంచి వృథాగా పారాయి. జాతీయ రహదారి విస్తరణకు వచ్చిన కాంట్రాక్టు సంస్థ సిబ్బందికి ఎక్కడ పైప్‌లైన్ ఉన్నది తెలియదు. మిష న్ భగీరథ పైప్లైన్లు ఎక్కడెక్కడి నుంచి వెళ్లాయి అనే విషయాలు తెలుపాల్సిన బాధ్యత మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులకు ఉంది. సమన్వయలోపం వల్ల మిషన్ భగీరథ పైప్లైన్లు పగిలిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ రహదారిని విస్తరిస్తున్న కాంట్రాక్టర్‌కు మిషన్ భగీరథ పైప్‌లైన్ ఎలా వెళ్లిందో అధికార బృందం ప్రత్యక్షంగా చూపించింది. అయినా కాంట్రాక్టర్ తాలుకు సిబ్బంది పైప్లైన్లను డ్యామేజ్ చేస్తున్నారు. మరమ్మతుకు సమయం పడుతుంది. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలిపి ఇక మీదట పైప్‌లైన్ పగులకుండా చూస్తాం.
– సుచరిత, మిషన్ భగీరథ డీఈ, సంగారెడ్డి జిల్లా