పటాన్చెరు రూరల్, నవంబర్ 10 : సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో పరిధిలోని రామేశ్వరంబండ, వీకర్ సెక్షన్ కాలనీ, బచ్చుగూడెం, ఐనోల్, పెద్ద కంజర్ల, చిన్నకంజర్ల గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగిలో జాతీయ రహదారి వద్ద మిషన్ భగీరథ మెయిన్‌లైన్ వారం క్రితం పగిలిపోయింది.
దానిని మరమ్మతులు చేయించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తుండడంతో ముత్తంగి, పోచారం, చిట్కుల్, ఇంద్రేశం మున్సిపాలిటీలోని ఆరు గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.కాలుష్య పీడిత గ్రామాలుగా గుర్తింపు పొందిన ముత్తంగి, చిట్కుల్, పోచారం, ఇంద్రేశం గ్రామాలకు నల్లా నీరు ఇవ్వని పక్షంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు కావడం లేదు.
రామేశ్వరంబండ వీకర్ సెక్షన్ కాలనీలో, అక్కడే ఉన్న జేఎన్ నార్మ్ అపార్టుమెంట్లలో ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కట్టించిన ఇండ్లు కావడంతో వారికి బోర్లు లేవు. ప్రభుత్వం సరఫరా చేసే నల్లా నీరే దిక్కు. ఇండ్ల ముందు తాగునీటి కోసం డ్రమ్ములు పెట్టుకొని వేచి చూస్తున్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో 30వేల జనాభా ఉంది. ఇంద్రేశం మున్సిపాలిటీ సేవలపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తున్నది.
ఆర్వో వాటర్‌ను కొని అవసరాలు తీర్చుకుంటున్నామని ప్రజలు వాపోతున్నారు. రామేశ్వరంబండ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే సేవలు బాగుండేవని మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. సమస్యపై మిషన్ భగీరథ అధికారులకు సమాచారం ఇచ్చామని, మున్సిపాలిటీలో 30వేల జనాభాకు సరిపోను నీరు సరఫరా చేయాలని కోరినట్లు తెలిపారు.