గజ్వేల్, మార్చి 13: పదేండ్ల కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట వేశారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీద్‌లో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మదీనా మసీద్ అభివృద్ధికి కేసీఆర్ కృషిచేశారన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, పట్టణ సమీపంలో విశాలమైన ప్రదేశంలో ఈద్గానిర్మాణం చేపట్టినట్లు గుర్తుచేశారు.
కేసీఆర్ హయాంలో రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం అందజేశామని కాంగ్రెస్ వచ్చిన తర్వాత విస్మరించిందన్నారు. మైనార్టీలకు ఆదుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందని, గతంలో చూడని అభివృద్ధి కేసీఆర్ హయాంలో జరిగిందన్నారు. గజ్వేల్ మరింత అభివృద్ధి జరగాలంటే మరో సారి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే జరుగుతుందన్నారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విఫలమైందన్నారు. మైనార్టీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
కేసీఆర్‌తోనే అన్ని విధాలుగా న్యాయం జరిగిందని, నేడు ప్రతిఒక్కరూ గుర్తు చేసుకునేలా అభివృద్ధి చేపట్టామన్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన దుర్మార్గంగా కొనసాగుతుందని, ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ విధానాలపై సంతృప్తిగా లేరన్నారు. యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని, గ్యాస్ లేక సంక్షోభం ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముస్లింలకు రూపాయి కూడా ఖర్చు చేయలేదని, అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చుడేమో కానీ, అభివృద్ధి కోసం కేసీఆర్ ఇచ్చిన నిధులను కూడా వాపస్ తీసుకున్నారన్నారు.
బాన్సువాడ, మెదక్, కామారెడ్డి, బైంసా, ఆసిఫాబాద్. జైనూర్ ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, జమాతే ఉల్మా హింద్ జనరల్ సెక్రటరీ ముఫ్తీ జుబేర్, హైకోర్టు న్యాయవాది టి.రాజు, నాయకులు రాజమౌళి, మాదాసు శ్రీనివాస్, దేవీరవీందర్, మధు, నర్సింగరావు, రవీందర్, విరాసత్‌అలీ, జుబేర్‌పాషా, యూసుఫ్, నవాజ్, జకియోద్దీన్, ఉమార్, హైదర్‌పటేల్ పాల్గొన్నారు.