చేర్యాల, ఫిబ్రవరి 20: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పాలకులు, కనీసం దేవతలకు ఇచ్చిన హామీని సైతం నిలబెట్టుకోవడం లేదు. కొమురవెల్లి ఆలయంలో కొలువుదీరిన బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు స్వర్ణ కిరీటం తయారు చేయించి సమర్పిస్తామని గతేడాది దేవాదాయశాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ కల్యాణోత్సవానికి హాజరైన సందర్భంగా ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఆ హామీని మంత్రులు నిలబెట్టుకోలేదు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఘనంగా కొనసాగుతున్నాయి. కానీ, అమ్మవార్ల కిరీటాలు మాత్రం తయారుకాలేదు. దీంతో మంత్రుల హామీలు ఉత్తవే అనే విమర్శలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. కొమురవెల్లి ఆలయానికి భక్తులు సమర్పించిన బంగారం 8కిలోలకు బ్యాంకు లాకర్లలో భద్రపరిచి ఉంది. బ్యాంకర్లలో ఉన్న బంగారం తీసుకువచ్చి దానికి ప్రత్యేకంగా టెండర్లు పిలిచి ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో కిరీటాలు తయారు చేయించాల్సి ఉంటుంది. కేవలం ఆదేశాలు ఇస్తే పూర్తయ్యే ఈ పనులను సైతం మంత్రులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిపై కాంగ్రెస్ పాలకులు చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆలయ పాలక మండలి నియామకం విషయంలో 70 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే, అందులో 8 మందికి మాత్రమే పాలక మండలి సభ్యులుగా నియమించారు. 14 మంది సభ్యులు ఉండాల్సి ఉండగా, మిగిలిన సభ్యుల నియామకం కోసం మరో ప్రకటన విడుదల చేసి తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడంతో మరో 40 మంది సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు.దీంతో కొమురవెల్లి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటికీ పాలక మండలి నియామకం లేకుండా ఆగిపోయింది. కొమురవెల్లి మల్లన్న ఆలయ పరిపాలన ఉద్యోగి డిప్యూటీ కమిషనర్ హోదా కలిగి ఉన్నప్పటికీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ను గతంలో నియమించారు. ప్రస్త్తుతం ఆలయంలో ఒక ఏఈవో, ఇద్దరు సూపరింటెండెంట్లు ఉండగా, హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు అనే అధికారిని మల్లన్న ఆలయ పుల్ అడిషనల్ చార్జ్ బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ హయాంలో పలువురు నిరుద్యోగులకు తాత్కాలిక ప్రాతిపదికన ఆలయంలో ఉద్యోగాలు కల్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదుగురు నిరుద్యోగులను తొలిగించడంతో వారు రోడ్డున పడ్డారు. కాంగ్రెస్ సర్కారుకు కొమురవెల్లి మల్లన్న ఆలయంపై చిన్నచూపు ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి కేసీఆర్ హయాంలో తగిన గుర్తింపు, ఆదరణ లభించింది. కల్యాణోత్సవానికి ఓ పర్యాయం సీఎం హోదాలో కేసీఆర్ హాజరై స్వామి వారికి 133 ఎకరాల భూమిని కేటాయించారు. అనంతరం మంత్రి హోదాలో తన్నీరు హరీశ్‌రావు హాజరై భక్తుల కోరిక మేరకు కొమురవెల్లి మల్లన్న స్వామికి వెండి సింహాసనం చేయించి ఇస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత స్వామి వారి ద్వారాలు, తలుపులకు వెండి తాపడం చేయిస్తామని హామీ ఇచ్చి దానిని నెరవేర్చారు. మల్లన్న స్వామి కల్యాణోత్సవానికి బంగారు కిరీటం చేయిస్తామని హామీ ఇచ్చి కల్యాణోత్సవ సమయంలో స్వర్ణ కిరీటం తయారు చేయించి గర్భాలయంలో స్వామివారి తలకు కిరీటం ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా ఆలయంలో కొత్తగా క్యూకాంప్లెక్స్లు, కాటేజీల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆలయం ఖ్యాతి రాష్ట్రమంతా విస్తరించి భక్తుల తాకిడి పెరిగింది.