రామచంద్రాపురం, జూన్ 20 : సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల టౌన్షిప్ దేశానికే ఆదర్శం అని రాష్ట్ర ఆర్అండ్బీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల టౌన్‌షిప్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పెషల్ ఛీప్ సెక్రటరీ అరవింద్‌కుమార్ మంగళవారం పరిశీలించారు.
సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి వారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్‌కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో చర్చించారు. సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న బ్లాక్, ఆయా పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లు, సెక్యూరిటీ విషయమై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద ఆదర్శ టౌన్‌షిప్‌ని కొల్లూరులో నిర్మించిందని తెలిపారు. ఒకేచోట లక్ష జనాభా ఆవాసం ఉండేలా 117 బ్లాక్‌లతో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిందన్నారు. ప్రతి బ్లాక్‌కి రెండు లిఫ్ట్‌లు, జనరేటర్లు, ఫైర్‌సేఫ్టీ, అండర్‌గ్రౌడ్ కేబుల్ ఇలా కార్పొరేట్ హంగులతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన్నట్లు చెప్పారు. పేదల సంతోషమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నట్లు చెప్పారు.