జహీరాబాద్, సెప్టెంబర్ 12: చెరుకు రైతులకు పెండింగ్ బకాయిలు సకాలంలో చెల్లించకపోతే ట్రైడెంట్ చక్కర ఫ్యాక్టరీని రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వేలంవేసి రైతుల బకాయిలు చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయం లో జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు బిల్లులు చెల్లించడంలో యాజమాన్యం జాప్యం చేయడం సరికాదన్నారు. చెరు కు రైతులపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తుందని, బకాయిలు చెల్లించకుండా వాయిదా వేయడాన్ని సహించేది లేదన్నారు. గత సమావేశంలో ఆగస్టు 23లోగా పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని తెలిపి, ఇప్పటివరకు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. చెరుకు రైతులకు పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి ఫ్యాక్టరీని ఇతరులకు విక్రయించి నడిపిస్తామని మంత్రి తెలిపారు. ఈనెల 20తేదీలోగా రైతులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించని పక్షంలో ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొని వేరేవారికి అమ్మకుండా ఆంగీకారపత్రం రాసి ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. సమావేశం లో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ తన్వీర్, ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, నామ రవికిరణ్, గోవర్ధన్‌రెడ్డి, కేన్ సహాయ కమిషనర్ రాజశేఖర్, ఆర్డీవో వెంకారెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు ఫ్యాక్టరీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.