గజ్వేల్, ఆగస్టు 13: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సబ్సిడీపై ఆయిల్ పామ్ మొక్కలు అందజేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నది. గతేడాది ఆయిల్‌పామ్ సాగుపై వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వమే మొక్కలు పంపిణీ చేయడంతో అన్ని విధాలుగా అండగా ఉంటున్నది. పంటసాగు చేసిన రైతుల పొలాలను అధికారులు సందర్శించి సలహాలు, సూచనలు చేస్తున్నారు. రైతులు అధిక సంఖ్యలో పంట సాగుచేసేలా అధికారులు కృషిచేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 10వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. మరో 10వేల ఎకరాల్లో రైతులు సాగు చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతు సాగు పంట సాగుపై అవగాహన
మూడు సంవత్సరాలుగా ఆయిల్‌పామ్ పంట సాగుపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మూడేండ్లు కష్టపడి పంటను కాపాడితే 30 ఏండ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉండడంతో అధికంగా లాభాలు రానున్నాయి. గజ్వేల్ మండలం దాతర్పల్లి గ్రామానికి చెందిన రైతు తోట లక్ష్మణ్ అక్కారం సమీపంలోని తన వ్యవసాయ భూమిలో పది ఎకరాల విస్తీర్ణంలో ఏడాది క్రితం నుంచి ఆయిల్‌పామ్ మొక్కలు సాగు చేస్తున్నాడు. ఎకరానికి 57 మొక్కల చొప్పున పది ఎకరాల్లో 570 మొక్కలను తొమ్మిది మీటర్లకు ఒకటి చొప్పున నాటాడు. మొక్కల మధ్యన ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండడంతో అందులో పది నెలల క్రితం రూ.8 చొప్పున ఒక్కో మొక్కకు ఖర్చు చేసి ఐదువేల అరటి మొక్కలను యాదాద్రిభువనగిరి జిల్లా నుంచి తీసుకొచ్చి నాటాడు. ప్రస్తుతం అరటి కాత దశకు రావడంతో మూడేండ్ల పాటు పంటను సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏడాదిలో ఆయిల్‌పామ్, అరటి పంటకు లక్ష రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేశాడు. 80శాతం సబ్సిడీపై డ్రిప్, ఒక మొక్కకు రూ. 20 చొప్పున ప్రభుత్వం అందజేస్తున్నది.ఈజీఎస్‌లో భాగంగా రైతులు మొక్క నాటడానికి కూలీల ఖర్చు రూ.60, ఎకరానికి రూ.4,200 ప్రభుత్వం మెయింటెనెన్స్ రైతులకు అందజేస్తున్నది. పంటలో ఎలాంటి మందులు పిచికారీ చేసినా రైతులకు ఆ డబ్బులు కూడా ఇస్తున్నది.
మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో…
సిద్దిపే జిల్లాలో 10వేల ఎకరాల విస్తీర్ణంలో గతేడాది రైతులు ఆయిల్‌పామ్ సాగుచేయగా ఈ ఏడాది మరో 10వేల ఎకరాల్లో సాగు చేసే విధంగా చూడాలని జిల్లా అధికారులను ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. ఆయిల్‌పామ్ సాగుపై ప్రత్యేక చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయించి మాట్లాడుతున్నారు. జిల్లాలో అత్యధికంగా రైతులు సాగుచేసేలా చూడాలని అధికారులతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పంట ప్రయోజనాలు తెలుపాలన్నారు. రైతులు అధిక విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ మొక్కలు సాగుచేసేలా చూడాలని గజ్వేల్ మండలం అక్కారంలోని రైతు లక్ష్మణ్ తోటను సందర్శించన సమయంలో మంత్రి అధికారులను ఆదేశించారు.
ఏడాదిలో అరటి కాతకొచ్చింది
రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో పది ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు చేశా. అందులో అంతర పంటగా ఏడాది నుంచి అరటి సాగుచేస్తున్నా. ప్రస్తుతం అరటి కాత దశకు చేరింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతోనే పంట సాగు చేసేందుకు ముందుకొచ్చా.ఆయిల్‌పామ్ పంటతో ప్రయోజనం తెలిసిన తర్వాత గ్రామాల్లో చాలా వరకు రైతులు పంటసాగు చేసేందుకు ముందుకొస్తున్నారు.
– తోట లక్ష్మణ్, రైతు, దాతర్పల్లి