చౌటకూర్, ఏప్రిల్ 3 : బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులకు అనుగుణంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సర్పంచ్ల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు చౌటకూర్ మండల చక్రియాల్ గ్రామ మాజీసర్పంచ్, అందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అందోల్ కృష్ణ సోమవారం మంత్రి హరీశ్‌రావు, అందోల్ ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ యెగ్గెమల్లేశం సమక్షంలో హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలోపేతానికి పాతకొత్త అనిలేకుండా అందరూ శ్రమించాలని సూచించారు. అందోల్‌లో వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని, పార్టీలో చేరినవారికి సముచితస్థానం కల్పిస్తామని, సీనియర్ నాయకులను సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు.
చక్రియాల్ గ్రామ మాజీసర్పంచ్ అందోల్కృష్ణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడాన్ని స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన నాయకులకు మంత్రి హరీశ్‌రావు, అందోల్ ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు చౌకంపల్లి శివ కుమార్, చక్రియాల గ్రామశాఖ అధ్యక్షుడు తుంగె ఆనంద్, బీఆర్ఎస్ బీసీసెల్ మండలాధ్యక్షుడు తుంగె మల్లేశం, నాయకులు రవి కుమార్ పాల్గొన్నారు.