సిద్దిపేట, ఆగస్టు 26 : దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట శివారులోని రంగనాయకసాగర్ తెలంగాణ తేజోవనంలో శనివారం జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ప్రజాప్రతినిధులతో కలిసి 30వేల మొకలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిలో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఆర్ట్‌గ్యాలరీ సందర్శించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం పథకాలు ప్రవేశపెట్టి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఒకేరోజు కోటి మొకలు నాటే వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. హరితహారం ద్వారా తెలంగాణలో ఇప్పటి వరకు 273.33 కోట్ల మొకలు నాటినట్లు చెప్పారు. దేశంలోనే అత్యధిక మొకలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టిచిందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంట్లో చెప్పిందని గుర్తుచేశారు.
మహారాష్ట్రలో 30కోట్ల మొక్కలు నాటి రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలోనే జిల్లా రెండోస్థానంలో నిలిచిందన్నారు. ప్రపంచంలో పర్యావరణ హితమై బ్రెజిల్, చైనా తర్వాత చేపట్టిన అతిపెద్ద మానవ ప్రయత్నం తెలంగాణకు హరితహారం కార్యక్రమంగా చరిత్రకెకిందన్నారు. రాష్ట్రంలో పచ్చదనంతో ఇప్పటికే 28శాతానికి చేరిందని, మరో 5 శాతం సాధిస్తే 33శాతం అడవులు ఉన్న రాష్ట్రంగా దేశానికే తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలువనున్నదన్నారు. సిద్దిపేటను ఆకుపచ్చ పట్టణంగా మార్చుకున్నామన్నారు. మొకలను సంరక్షించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట స్వచ్ఛబడిని సందర్శించి, చెత్త నుంచి సంపద ఎలా సృష్టించాలి.. స్వచ్ఛత పాఠాలు ఎలా నేర్చుకోవాలి.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు మంత్రి సూచించారు.
అనంతరం జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్‌రావు మార్గనిర్దేశంలో ఇప్పటికే బొకేలకు స్వస్తి పలికి, పూల మొకలు ఇచ్చే స్థాయికి చేరుకున్నదన్నారు. అంతకుముందు కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో 33 శాతం గ్రీనరీ పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో 860 మొకలు, మున్సిపాలిటీలో 30వేల మొకలు నాటుతున్నామన్నారు. జిల్లాలో 3.50కోట్ల మొక్కలు నాటి బతికించుకున్నామన్నారు. జిల్లాలో 4.72 కోట్ల ప్లాంటేషన్ చేపట్టినట్లు, 60 వేల ఎకరాల్లో అటవీ సంపద పెరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జెస్సికా, మహిత, లోహిత విద్యార్థినులు హరితహారంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం విద్యార్థులకు మొక్కలు అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగింటి కనకరాజు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నర్సింగ్ కౌన్సిల్ మెం బర్ పాల సాయిరామ్, మున్సిపల్ కమిషనర్ సం పత్ కుమార్, కౌన్సిలర్ విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.