మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 20: మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల స్ఫూర్తిని కొనసాగించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. గురువారం మద్దూరు మండలంలోని కమలాయపల్లిలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ బయోడీజిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 200 ఏండ్ల క్రితం గ్రామాల్లో ఉన్న అంటరానితనం, అస్పృశ్యతలపై జ్యోతిరావు, సావిత్రిబాయి పూలేల పోరాటాల ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు.
స్త్రీలకు విద్య ఎంతో అవసరమని గ్రహించి మహిళల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత సావిత్రిబాయిపూలేకు దక్కుతుందన్నారు. చేర్యాల ప్రాంతం ఉద్యమాల గడ్డ అని, చేర్యాల ప్రజల రక్తంలోనే తిరుగుబాటు ఉన్నదన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, విప్లవోద్యమాల నుంచి మలిదశ తెలంగాణ పోరాటం వరకు చేర్యాల ముందు వరసలో నిలిచిందన్నారు. చేర్యాల ప్రాంతానికి సాగునీరందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రోడ్ల మంజూరుకూ హామీనిచ్చారు. అనంతరం మంత్రి సీతక్కను పలువురు శాలువాలతో సత్కరించారు. అనంతరం కమలాయపల్లి గ్రామస్తులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో నాగపురి రాజలింగం, గిరి కొండల్‌రెడ్డి, మల్లేశం, కొమ్ము రవి, కోల సాయిలు, కల్యాణీకమలాకర్ తదితరులు పాల్గొన్నారు.