హుస్నాబాద్, ఆగస్టు 9:బ్రిటీసోళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించడం కోసం జరిగిన స్వాతంత్య్ర సంగ్రమంలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఎంతో కీలకమని, ఈ ఉద్యమంతోనే ఆంగ్లేయు లు దేశం నుంచి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చారని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవా రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్టీ, జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీజీ ఇచ్చిన ఒక్క పిలుపుతో క్విట్ ఇండియా ఉద్యమంలో కలిసికట్టుగా ప్రజలు పాల్గొన్నారని, అదే స్ఫూర్తితో ప్రస్తుతం గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. గ్రామాల్లో వాతావరణ సమతుల్యానికి మొక్కలు నాటడం, పరిశుభ్రమైన పల్లెలను తయారు చేసుకొని గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకుందామన్నారు.
గ్రామస్థాయి నుంచి అఖండ భారతదేశం వరకు ఉన్న ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా ఐక్యంగా కష్టపడాలన్నారు. స్వాతంత్య్ర ఫలాలను అందరికీ చేరే విధంగా అటు పాలకులు, ఇటు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు బొలిశెట్టి శివయ్య, కేడం లింగమూర్తి, వల్లపు రాజు, భూక్యా సరోజన, చిత్తారి పద్మ, మడల జయపాల్‌రెడ్డి, యాదవరెడ్డి, పున్న సది, ఎగ్గిడి అయిలయ్య, వీరన్న పాల్గొన్నారు.