హుస్నాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేయడం, విభజన హామీలు నెరవేర్చడం కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని, ఈ విషయంలో కేంద్రం తీరు బాగాలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు , ఇతర పథకాలకు సంబంధించిన పనులు తేవడంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీ సాకు చూపి పదేండ్ల పాటు పబ్బం గడిపారని, ఇప్పుడు కేంద్రం చుట్టూ తాము తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌లో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పదేండ్ల పాటు బీఆర్ఎస్ సీఎం , మంత్రులు అడగడ లేదని, అడిగితే అన్నీ ఇచ్చేవాళ్లమని చెప్పిన కేంద్ర మంత్రులు, ఇప్పుడు కేంద్రం చుట్టూ కాలికి బట్టకట్టుకొని సీఎం రేవంత్ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఏ ప్రాజెక్టు రాకున్నా కేంద్ర మంత్రులదే బాధ్యత అని, కిషన్‌రెడ్డి ఉట్టి మాటలు చెప్పడం కాకుండా ప్రాజెక్టుల మంజూరుకు కృషి చేయాలని హితవు పలికారు. తెలంగాణ నుంచి జీఎస్టీ, పన్నుల రూపంలో చెల్లింపులు చేస్తే తిరిగి అభివృద్ధి నిధులు ఇవ్వడంలో బీజేపీ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని మంత్రి మండిపడ్డారు. కులగణనకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని, ఈబీసీ కోసం షెడ్యూల్లో చేర్చినట్లే బీసీల రిజర్వేషన్‌ను రాజ్యాంగం షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధ్దత కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. లేకుంటే రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో బీజేపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య పాల్గొన్నారు.