హుస్నాబాద్, అక్టోబర్ 2: పర్యావరణ పరిరక్షణకు ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రియదన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ. కోటి పది లక్షలతో నిర్మించిన మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు(ఎఫ్ఎస్టీపీ)ను ఆయన ప్రారంభించారు. అంతకుముందు హుస్నాబాద్‌లోని గాంధీ చౌరస్తాలో మహాత్మాగాంధీ విగ్రహానికి సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
గాంధీచౌక్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశా రు. ఎఫ్ఎస్టీపీ ప్లాంటు వద్ద జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మానవ వ్యర్థాల నుంచి రైతులకు ఉపయోగపడే ఎరువులను తయారు చేసే ప్లాంటును గాంధీ జయంతి రోజు ప్రారంభించడం హర్షణీయమన్నారు. మానవవ్య ర్థాల నుంచి ఎరువుల తయారీ అనేది వినూత్న ప్రయోగం అని, ప్లాంటు నిర్వహణకు అందరూ సహకరించాలన్నారు. ప్లాంటు నిర్వాహకులు కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
హుస్నాబాద్ పట్టణాన్ని సుందరపట్టణంగా తీర్చిదిద్దుతామని, అందులో భాగంగానే పట్టణంలోని మూడు ప్రధాన కూడళ్ల సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉం చుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, వాల సుప్రజ, సరోజన, చిత్తారి పద్మ, దొడ్డి శ్రీనివాస్, వల్లపు రాజు, పున్న లావణ్యసది, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.