హుస్నాబాద్‌టౌన్, మార్చి 30: విశ్వావసునామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని బీసీ సంక్షేమం, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, శివాలయం వద్ద ఆదివారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉగాది పర్వదినం నుంచి అందరూ సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు లేకుండా తెలంగాణ ప్రజాపాలనలో ప్రజలందరికీ లాభం జరిగేలా చూడాలని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు. అనంతరం బ్రాహ్మణులు హుస్నాబాద్‌కు చెందిన ఆదా యం బాగుంటుందని, ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని వివరించారు. ఈ ఏడాది హుస్నాబాద్ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో టీస్టాల్ యజమానులకు స్టీల్గ్లాసులను మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ పంపిణీ చేశారు.
పర్యావరణాన్ని కాపాడేందుకు, ప్లాస్టిక్‌ను నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు కృషిచేయాలని ఆయన కోరారు. అంతకు ముందు ఎల్లమ్మచెరువుకట్టపై వాకింగ్చేసి వాకర్స్‌తో ముచ్చటించారు. సిద్దిపేట జిల్లాగ్రంథాలయ సంస్థచైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండోచైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, మాజీవైస్చైర్ పర్సన్ అయిలేని అనిత, మాజీప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీలో ఫొటోపై వివాదం
స్థానిక శివాలయం వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఫొటోను పెట్టకపోవడంపై కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్‌ను బీజేపీ పట్టణశాఖ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ ఫొటోను ఫ్లెక్సీలో పెట్టకుండా వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని కమిషనర్ చెప్పారు. అనంతరం మరో ఫ్లెక్సీని ఏర్పాటుచేయడంతో వివాదం సద్దుమణిగింది.