హుస్నాబాద్‌టౌన్, డిసెంబర్ 23: ఏసుప్రభు ఆలోచన విధానంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని రవాణా,బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సోమవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రైస్తవులతో కలిసి కేక్‌కట్‌చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవవిలువలు, ప్రేమ, ఆప్యాయతతోనే ముం దుకు పోవాలని, ఘర్షణలు పడకుండా చర్చలు, శాంతితోనే అన్నింటినీ పరిష్కరించుకునే విధంగా వెళ్లాలని ఏసు సూచించాడని చెప్పారు.
ప్రజల జీవితాల్లో మార్పురావాలని, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి దీవెనలు ఇవ్వాలని వేడుకొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేవిధంగా బలాన్ని ఇవ్వాలని యేసుప్రభువును వేడుకున్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్‌చైర్‌పర్సన్ ఆకుల రజితావెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, సింగిల్‌విండోచైర్మన్ బొలిశెట్టి శివయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రైస్తవులు పాల్గొన్నారు.