కోహెడ సెప్టెంబర్ 23: సిద్దిపేట జిల్లా కోహెడ మం డలంలో రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. శనిగరం ప్రాజెక్టును పరిశీలించి పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో మా ట్లాడారు. గుట్ట నుంచి నీటి జాలు హాస్టల్లోకి వస్తున్నాయని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే నీటిని కాల్వ ద్వారా మళ్లించి మెయిన్ డ్రైనేజీలో కలపాలని అధికారులకు సూచించారు. తంగల్లపల్లిలో జరుగుతున్న బీటీ రోడ్డు పనులకు విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉన్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే వాటిని తొలిగించేందుకు రూ. ఐదు లక్షల 60వేలు మంజూరు చేశారు. త్వరగా పనులు ప్రారంభించాలని మంత్రి సిద్దిపేట ఎస్ఈ ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపూర్, శ్రీరాములపల్లి, కోహెడ బీటీ రోడ్లు, గొట్లమిట్ల నారాయణపూర్ మధ్య హైలేవల్ బ్రిడ్జి మంజూరైందన్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం కోహె డ హోటల్లో టీ తాగుతూ కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడారు. నాయకులు మంద ధర్మయ్య, గొరిట్యాల లక్ష్మణ్, ముంజ తిరుపతి, బందెల బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.