కాంగ్రెస్‌వన్నీ మోసాలేనని, ఒక్క చాన్స్ ఇవ్వాలని మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని, 55ఏండ్లు చాన్స్ ఇస్తే ఏం చేశారని మంత్రి కేటీఆర్ తీవ్రంగా దుయ్యబట్టారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని గంజి మైదానంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు భారీ బైక్ ర్యాలీతో మంత్రి కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సభలో మంత్రి మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, ఆరుగజాల జాగ ఇవ్వకుండా ప్రజలను వంచించి మోసం చేసే కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సంగారెడ్డి ప్రజలకు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలతో బంధుత్వాలు ఉన్నాయని, కరెంటు కష్టాలను తెలుసుకునేందుకు అక్కడి ప్రజలను కదిలిస్తే కన్నెర్ర చేస్తున్నారని గుర్తు చేశారు. గెలిస్తే బీఆర్ఎస్లోకి వస్తానని మాయమాటలు చెబుతున్న జగ్గారెడ్డి, సంగారెడ్డిలో 40వేల ప్లాట్లు ఇచ్చారా.. పింఛన్లు పంపిణీ చేశారా ప్రజలే తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా ప్రజల్లో ఉంటూ సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేసిన చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
సంగారెడ్డి/సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 8: ఉద్యమాలతో సాధించిన తెలంగాణను పదేండ్లలో అభివృద్ధి చేసుకోవడంతో ప్రజల సంతోషాన్ని చూసి ఇష్టంలేకనే మరోసారి కాంగ్రెస్ మాయమాటలతో ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేస్తుందని మంత్రి కేటీఆర్ తీవ్రంగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఖతం అవుతుందని, పక్క రాష్ట్రం కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఆరునెలలు కాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఐదుగంటల కరెంటే ఇస్తుందని విమర్శించారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని గంజిమైదానంలో ఎన్నికల బహిరంగ సభకు భారీ బైక్ ర్యాలీతో మంత్రి కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం కలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు ఆరు గ్యారెంటీ పథకాలు ఇస్తామని ప్రకటన చేయడం శోచనీయమన్నారు. ఆరు గ్యారెంటీలు, ఆరు గజాల జాగ ఇవ్వకుండా ప్రజలను వచించి మోసం చేసే కుట్ర చేస్తుందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సంగారెడ్డి ప్రజలకు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలతో బంధుత్వాలు ఉన్నాయని, కరెంటు కష్టాలను తెలుసుకునేందుకు అక్కడి ప్రజలను కదిలిస్తే కన్నెర్ర చేస్తున్నారని గుర్తు చేశారు.
విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్న కర్ణాటకవాసులు ఎండిపోయిన చెరువుల నుంచి బయటకు వస్తున్న మొసళ్లను పట్టుకుని సబ్స్టేషన్ల ముందు వదిలిపెట్టి నిరసన తెలిపిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఇవన్నీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో జరుగుతుంటే తెలంగాణ ఎన్నికల్లో ఒక్కఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ నాయకులు కోరడం విడ్డూరమన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి 11సార్లు అంటే 55 ఏళ్ల పాటు కాంగ్రెస్‌కు చాన్స్‌లు ఇస్తే ఏమిచేసిందని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ పదేండ్ల పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, మతకలహాలు లేకుండా హిందూముస్ల్లిం సోదరాభావంతో ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని చురకలంటించారు. అన్ని పండుగలకు ప్రభుత్వం సముచితస్థానం కల్పిస్తూ బతుకమ్మ పండుగకు చీరలు, రంజాన్‌కు తోఫాలు, క్రిస్మస్కు గిఫ్ట్‌లు అందజేసి శాంతియుత వాతావరణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పిస్తున్నారన్నారు. ప్రజలు మోసపోయి మాయమాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపోళ్లకు ఓట్లేస్తే గోసపడతామని గుర్తు చేశారు.
గత 2018 ఎన్నికల్లో నియోజవర్గంలోని 40వేల మందికి ఇండ్ల స్థలాలు ఇస్తానని ప్రకటించిన జగ్గారెడ్డి ఏ ఒక్కరికైనా స్థలం ఇచ్చారా అని ప్రశ్నించారు. అలాగే గల్లీగల్లీకి ఏటీఎం పెట్టి ఖాతాలలో డబ్బులు వేస్తానన్న మాట నిలబెట్టుకున్నారా అని నిలదీశారు. తనకు ప్రభుత్వం ఇచ్చే ఎమ్మెల్యే గౌరవ వేతనం, అదనపు చార్జీలు కలిపి రూ.2లక్షలకు మరో రెండు లక్షలు కలిపి ప్రతి నెల 500 మంది పేద మహిళలకు ఐదువందలు చొప్పున పింఛన్ అందజేస్తానని చెప్పిన మాటలు నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ సారి ఎన్నికల్లో తాను గెలిస్తే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానని ప్రచారం చేసుకుంటున్న జగ్గారెడ్డికి బీఆర్ఎస్తో ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మూడోసారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించాలంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేసినట్లుగా వంద మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత ప్రజలదే అని గుర్తు చేశారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరించి ప్రచారం చేయాలని కోరారు.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మెడికల్ కళాశాల మంజూరుకు అప్పటి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయడంతో మెడికల్ కళాశాల మంజూరు చేశారని గుర్తు చేశారు. అదికూడా తాను మంజూరు చేయించినట్లు జగ్గారెడ్డి చెప్పకుంటున్నట్లు తనకు సమాచారం ఉన్నదని, అలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యక్ష్యంగా ఎన్నికల్లో గెలవలేక ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియాగాంధీ రాజకీయదాడి చేయడానికి రావడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో రూ. 400 ఉన్న గ్యాస్‌ను రూ.1200లకు పెంచి మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచారని ఆరోపించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రారంభించి అందజేస్తుందన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్ళిలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అందజేసి ఆర్థికసాయం చేస్తున్నదన్నారు. త్వరలో తెల్లరేషన్‌కార్డులు ఉన్న అందరికీ సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఎన్నికలు రాగానే గంగిరెద్డుల్లా వచ్చి ఓట్లు అడిగే నాయకుల మాయమాటలకు మోసపోవద్దని, గ్యారెంటీ పథకాల పేరుతో వంచించే వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. డిసెంబర్ 3న సంగారెడ్డి ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, మూడోసారి సీఎంగా కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిలో సంగారెడ్డి ఉన్నతస్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహకారంతో కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు చేయడమే కాకుండా మెడికల్ కళాశాలను ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ అవకాశానికి నేను జన్మంతా రుణపడి ఉంటాను. నేను ఏంటో నాకన్నా మీకే బాగా తెలుసు. కార్యకర్తలు, ప్రజలే నా బలం.. నా బలగం.. ప్రాణమున్నంతా మీతోనే కలిసి జీవిస్తా. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సీఎం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. 2014లో నన్ను ఆశీర్వదించారు. ఇటీవల అనారోగ్యానికి గురైతో ఎన్నో ప్రార్థనలు పూజలు చేశారు. సైనికులుగా, ఖార్యోన్ముకులుగా పనిచేస్తున్నా. మీకు ఎల్లప్పుడు రుణపడి ఉంటా. ఈ ఎన్నికల్లో తనకు భారీ మెజార్టీ అందించి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
రాబోయే రోజుల్లో కాబోయే సీఎం కేటీఆర్. కేసీఆర్ మూడోసారి సీఎం కాబోతున్నారు. భవిష్యత్తులో కేటీఆర్ సీఎం కావాలనేదే ప్రజల ఆకాంక్ష. జగ్గారెడ్డి ఉద్యమ ద్రోహి. మచ్చ ఉన్న వ్యక్తి జగ్గారెడ్డి అతడికి డిపాజిట్ కూడా రాదు. ఇటీవల జగ్గారెడ్డితో మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా మాట్లాడారనే అనుమానాలు తమకు ఉన్నాయని కేటీఆర్‌తో ప్రస్తావించినప్పుడు తాను మంత్రిగానే మాట్లాడానని, అంతకుమించి ఏమిలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలకు తావులేదని మంత్రి మాతో స్పష్టం చేశారు.
30న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి జగ్గారెడ్డిని ఓడించాలి. పట్టణంలో ఈ రోజు నిర్వహించిన 8వేల బైక్‌ల ర్యాలీ ఒక అద్భుతం. చింతా ప్రభాకర్‌ను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి నాంది పలకాలి.
ఇప్పటివరకు సంగారెడ్డి పరిధిలో కనీవినీ ఎరుగని రీతిలో బైక్ ర్యాలీ జరిగింది. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల సూచనల మేరకు నా ఉద్యోగానికి రాజీనామా చేసి చింతా ప్రభాకర్ గెలుపు కోసం కృషి చేస్తున్నా. ఇంకా రెండేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్న సీఎం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేశాను. నియోజకవర్గ ప్రజల సహకారంతో అత్యధిక మెజార్టీతో చింతా ప్రభాకర్‌ను గెలిపించి సీఎంకు బహుమానంగా అందిద్దాం.
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 8 : బీఆర్ఎస్ యువగర్జనకు హాజరైన మంత్రి కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట మండల కార్యకర్తలు పెద్ద ఎత్తున పోతిరెడ్డిపల్లి చౌరస్తాకు చేరుకుని స్వాగతం పలికారు. 8వేల బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్, కొత్త బస్టాండ్ మీదుగా పాతబస్టాండ్ వద్ద గల గంజిమైదాన్కు చేరుకున్నది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొన్నారు. పటాసులు కాలుస్తూ సంబురాలు చేశారు. మంత్రి కేటీఆర్ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో చింతా ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, పట్నం మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, బీఆర్ఎస్, కార్యకర్తలు పాల్గొన్నారు.