సిద్దిపేట ప్రతినిధి/ చేర్యాల, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. మల్లన్న స్వామి…మమ్మేలు అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆదివారం సిద్దిపేట జిల్లా మల్లన్న క్షేత్రంలోని తోట బావి కల్యాణ వేదిక వద్ద లగ్గం జరిగింది. కల్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణోత్సవంలో స్వామి వారి తరపున పడిగన్నగారి మల్లికార్జున్ దంపతులు, అమ్మవార్ల తరపున మహాదేవుని మనోహర్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారి తరపున మహాదేవుని సాంబయ్య, స్వామి వారి తరపున పడిగన్నగారి మల్లయ్య దంపతులు పాల్గొని కల్యాణ తంతు నిర్వహించారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితో కలిసి సమర్పించారు. ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు, ఈవో ఎ.బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య,అర్చకుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అంతకు ముందు కొమురవెల్లి గ్రామ సంప్రదాయం మేరకు సర్పంచ్ సార్ల లతాకిష్టయ్య దంపతులు, ఒగ్గు పూజారులు పట్టు వస్ర్తాలు, పుస్తె మట్టెలను సమర్పించారు.జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవో రమేశ్, ఎంపీపీలు తలారీ కీర్తనాకిషన్, బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీలు సిలువేరు సిద్ధప్ప, గిరి కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.
స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం ఏకాదశి ఉదయం 10.45 గంటలకు నిర్వహించాల్సిన కల్యాణం ఆలస్యంగా జరిగింది. కొమురవెల్లి పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద స్వామి వారి కల్యాణం నిర్వహించారు. అంతకు ముందు ఊరేగింపుగా వెళ్లి స్వామివారి తరపున మహాదేవుని వంశస్తులు, పడిగన్నగారి వంశస్తులు కూర్చుని కల్యాణోత్సవం నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి తాళి, మట్టెలు, ఓడి బియ్యం, బట్టలు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12గంటలకు రుద్రాభిషేకం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు.
స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అర్చకులు ఆలయం నుంచి పోలీసుబొమ్మ, రాతిగీరలు, ఆలయ పరిసరాల్లో ఊరేగింపుగా నిర్వహిస్తూ కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగరాజ దేశికేంద్ర శివాచార్యుల పర్యవేక్షణలో కల్యాణోత్సవం జరిగింది. నడిపుడి మఠం భావనయ్యస్వామి, భువనేశ్వరస్వామి, ఆనందయ్య, జ్ఞానేశ్వర్శాస్త్రి, చంద్రశేఖర్‌స్వామి, భద్రయ్యస్వామి పురోహితులుగా, వ్యాఖ్యాతలుగా డాక్టర్ మహంతయ్య, నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి స్వామీజీలు వ్యవహరించారు. ఉదయం 5గంటలకు ఆలయవర్గాలు రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అన్నం వండి రాశిగా తయారుచేసి దృష్టికుంభం కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అర్చకులు ఆలయం నుంచి పోలీసుబొమ్మ, రాతిగీరలు, ఆలయ పరిసరాల్లో ఊరేగింపుగా నిర్వహిస్తూ కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగరాజ దేశికేంద్ర శివాచార్యుల పర్యవేక్షణలో కల్యాణోత్సవం జరిగింది. నడిపుడి మఠం భావనయ్యస్వామి, భువనేశ్వరస్వామి, ఆనందయ్య, జ్ఞానేశ్వర్శాస్త్రి, చంద్రశేఖర్‌స్వామి, భద్రయ్యస్వామి పురోహితులుగా, వ్యాఖ్యాతలుగా డాక్టర్ మహంతయ్య, నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి స్వామీజీలు వ్యవహరించారు. ఉదయం 5గంటలకు ఆలయవర్గాలు రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అన్నం వండి రాశిగా తయారుచేసి దృష్టికుంభం కార్యక్రమాన్ని నిర్వహించారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవేరులైన బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు వచ్చే కల్యాణోత్సవానికి దేవాదాయశాఖ తరపున మంత్రి కొండా సురేఖ స్వర్ణ కిరీటాలు సమర్పించనున్నట్లు వేదిక వద్ద ఆలయ అర్చకులు ప్రకటించారు. కాగా, ఆలయంలో స్వామి వారిని ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మాట్లాడారు. మల్లికార్జునస్వామి క్షేత్రాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదన్నారు. మల్లన్న ఆశీర్వచనం అందరికీ ఉండాలన్నారు. మహాలక్ష్మి పథకానికి ఆదరణ వస్తున్నదని, బస్సుల సంఖ్యను మరింత పెంచుతామని ప్రకటించారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
స్వామివారి కల్యాణోత్సవం నిర్దేశించిన సమయానికి కాలేదు. మంత్రుల రాక ఆలస్యం కావడంతో గంట
ఆలస్యంగా ఆలయవర్గాలు కల్యాణ తంతును ప్రారంభించాయి. ఉదయం 10.45 గంటలకు జరగాల్సిన పెండ్లి ఆలస్యం కావడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కల్యాణ వేదిక వద్దకు మొదటగా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని 10.45గంటలకు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను 11.28 గంటలకు తీసుకొచ్చారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ముత్యాల తలంబ్రాలు, పట్టవస్ర్తాలను 11.38గంటలకు తీసుకొచ్చిన అనంతరం కల్యాణం జరిగింది. మాంగళ్యధారణ 12.28 గంటలకు అర్చకులు పూర్తి చేశారు.
మల్లన్న కల్యాణోత్సవం ఆద్యంతం గందరగోళంగా మారింది. దీంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. స్వామి వారి కల్యాణ వేదిక వద్ద గ్యాలరీల మార్పుతో డోనర్లు, భక్తులు, వీవీఐపీలు, మీడియా ప్రతినిధులు కల్యాణోత్సవాన్ని వీక్షించలేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కల్యాణ వేదికపై స్టీల్ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో కల్యాణోత్సవంలో ఏం జరుగుతున్నది, ఎవరెవరు హాజరయ్యారు అనే కనీస సమాచారం లోపించింది. గ్యాలరీల నుంచి తాళాలు వేసి ఒక్కోదాని తర్వాత ఒకటి వదిలిపెట్టేందుకు పోలీస్‌వర్గాలు యత్నించడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. అన్నిరకాల పాస్‌లను ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు. కల్యాణ వేదిక వద్ద వేసిన కుర్చీల సంఖ్యకు ఎక్కువగా ప్రజలు తరలిరావడంతో నిలబడి కల్యాణం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరైన సమయానికి మంత్రులు వస్తారని కల్యాణ వేదిక వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి సుమారు గంటపాటు నిరీక్షించారు. అనంతరం మంత్రులు రావడంతో ఎమ్మెల్యే పల్లా పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాకప్పి సన్మానించి స్వాగతం పలికారు.
గతేడాది జరిగిన కల్యాణోత్సవం సందర్భంగా మల్లన్నస్వామికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రూ.5లక్షలకు పైగా కట్నాలు సమర్పించుకున్నారు. కానీ, ఈసారి కల్యాణోత్సవం సందర్భంగా మంత్రి కొండా సురేఖ రూ.5116, పొన్నం ప్రభాకర్ రూ.5116, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రూ.5116, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రూ.5116, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రూ.5,116, కొండా సురేఖ కుమార్తె సుష్మితాపటేల్ రూ.21,116తో పాటు మరికొందరు వీఐపీలు చదివించిన కట్నాలు కేవలం లక్షలోపే కావడం గమన్హారం.