సిద్దిపేట, జనవరి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ల నుంచి నీటిని విడుదల చేసింది. దీంతో చెరువులకు కాళేశ్వర జలాలు చేరనున్నాయి. ఫలితంగా యాసంగికి సాగునీరు అందనున్నది. జిల్లా రైతాంగానికి సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిసెంబర్ 4న లేఖ రాశారు. లేఖ రాయడంతో పాటు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడి నీటి విడుదలకు చొరవ చూపారు. యాసంగికి సాగునీరు ఇవ్వకపోతే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సాగు నీటి కాల్వల వెంట తిరుగుతూ రైతులకు సాగునీరు విడుదల చేయాలని అనేక సార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు నీటి విడుదల చేయాలని ఆందోళనలు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి రైతులకు సాగునీటిని విడుదల చేసింది. శనివారం రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండాసురేఖ మల్లన్నసాగర్ నుంచి దుబ్బాక కెనాల్‌కు, రంగనాయక సాగర్ నుండి నీటిని విడుదల చేశారు. కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నీటి విడుదల కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వర జాలలు విడుదల చేయడంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో యాసంగి దున్నకాల సమయంలోనే నీటిని విడుదల చేసి రైతులకు సాగునీటి కష్టాలు రాకుండా చూసింది. దీంతో గుంట జాగ ఎండిపోకుంగా రైతులు పంటలు పండించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, ప్రజాప్రతినిధులు ఆందోళన చేయడం, డిమాండ్ చేస్తే తప్పితే నీటిని విడుదల చేయాలనే సోయి లేకుండా పోయింది.
కేసీఆర్ పాలనలో జిల్లా సస్యశ్యామలం..
సమైఖ్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు నిర్మా ణం చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను రికార్డు సమయంలో నిర్మించారు. వీటి నుంచి కాలువల ద్వారా రైతులకు యాసంగి పంటలకు సాగునీటిని విజయవంతంగా విడుదల చేసింది. దీంతో మండుటెండల్లో సైతం చెరువులు, చెక్‌డ్యామ్‌లు, వాగులు, వంకలు జలంతో కనిపించాయి. కూడవెల్లి, హల్దీవాగులకు గోదావరి జలాల ద్వారా జీవం పోసింది. ఫలితంగా భూమికి బరువయ్యేలా కొన్నేండ్ల నుంచి పంటలు పండాయి.
గుంట జాగ లేకుండా రైతులు అచ్చుకట్టి పంటలు సాగు చేశారు. ఫలితంగా రైతులకు చేతినిండా పని దొరికింది. పక్క రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీలకు ఉపాధి దొరికింది. ఉమ్మడి జిల్లాలో లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. రైతుబంధును సకాలంలో ఎకరానికి రూ. 5 వేల చొప్పున అందించడమే కాకుండా నాణ్యమైన 24గంటల కరెంట్‌ను అందించి వ్యవసాయాన్ని కేసీఆర్ పండుగ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీసుకుంటున్న చర్యలతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటి వరకు రైతుబంధు రాలేదు. రైతులు అప్పులు తెచ్చి యాసంగి సాగు చేస్తున్నారు. నీళ్లు వస్తాయే లేదో ..కరెంట్ పరిస్థితి ఎంటో అని దిగులు చెందుతున్నారు.
సగానికి పైగా భూములు సాగుచేయడం లేదు. మరికొంతమంది రైతు లు నీటి కష్టాలు తప్పవని తెలిసి ఆరుతడి పంటలను సాగుచేశారు. వరి నాటు దశలోనే కరెంట్ కష్టాలు వేధిస్తున్నాయి. జిల్లాలో అనధికార కరెంట్ కోతలను విధిస్తున్నారు. రాత్రి వేళ కరెంట్ కట్ అవుతున్నది. రోజంతా ఇచ్చే కరెంట్‌లో కూడా కోతలు షురూ అయ్యాయి. మాటిమాటికి కరెంట్ ట్రిప్ అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఫలితంగా సాగు చేసిన పంటలు కూడా చేతికి వస్తాయా..? లేదా అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో తమకు చేయూత కరువైందని రైతులోకం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.