సంగారెడ్డి జిల్లా మెడికల్ హబ్‌గా మారుతున్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వైద్యవిద్యను చేరువచేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కళాశాలను మంజూరు చేయగా, ఇప్పటికే మొదటి సంవత్సరం వైద్యవిద్య తరగతులు ప్రారంభమయ్యాయి, రేపు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి హరీశ్‌రావు నర్సింగ్ కళాశాల, వసతిగృహ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. 322 మంది విద్యార్థినులు విద్యసభ్యసించేలా మూడంతస్తుల్లో అత్యాధునిక వసతులతో తరగతి గదులు, వసతిగృహాలను ప్రభుత్వం నిర్మించనున్నది. ఇందుకోసం సీఎం కేసీఆర్ రూ. 34కోట్లు మంజూరు చేయగా, ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లా దవాఖానలో రూ.23.75కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్, రూ.1.38కోట్లతో నిర్మించనున్న రేడియాలజీ భవనాలకు సైతం మంత్రి భూమిపూజ చేస్తారు. జహీరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, కోహీర్ మండలంలో రూ.11.5కోట్లతో సిద్ధం చేసిన దవాఖాన కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు.
సంగారెడ్డి, మార్చి 4: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాల, వసతిగృహానికి తొలి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డిలో మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం సంగారెడ్డిలో వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. నర్సింగ్ కోర్సు చేయనున్న విద్యార్థులకు వీలుగా 50237 వేల చదరపు అడుగుల్లో కళాశాల భవనం, మరో 47861 చదరపు అడుల్లో వసతిగృహం నిర్మాణం మూడు అంతస్తుల్లో విశాలవంతమైన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం నర్సింగ్ కళాశాల భవనం టెండర్ ప్రక్రియలో ఉన్నందున ఈనెలలో అన్ని పూర్తి చేసుకుని నిర్మాణానికి అడుగులు పడనున్నాయి.
మంత్రి హరీశ్‌రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నర్సింగ్ కళాశాల, వసతి గృహాన్ని ఆదివారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. అంతకుముందు కోహీర్‌లో నూతనంగా నిర్మించిన 50 పడకల దవాఖాన భవనాన్ని ప్రారంభిస్తారు. సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు రాజంపేట రోడ్డు దువా ప్రైవేటు దవాఖాన ముందు నుంచి బైపాస్ రోడ్డును కలిపే రూ.84 లక్షల బీటీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టనున్నారు. తారా డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు రూ.3.40 కోట్లతో నిర్మించనున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ ప్రాంగణంలో నిర్మించనున్న టీఎన్జీవో భవనం, రూ.51.75 కోట్లతో నిర్మించనున్న జడ్ఎంఎస్ దుకాణాల సముదాయానికి శంకుస్థాపన, స్ట్రీం వాటర్ డ్రైన్ రజాక్ కిరాణం నుంచి కింది బజార్ వయా పోస్ట్ ఆఫీస్ వరకు రూ.1.50 కోట్లతో నిర్మించనున్న పనులను మంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.
మూడు అంతస్తుల్లో భవన నిర్మాణం..
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజంపేటకు వెళ్లే రహదారి పక్కన పోలీస్ మైదానంలో నర్సింగ్ కళాశాలతో పాటు వసతిగృహం నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడు అంతస్తుల్లో నర్సింగ్ కళాశాల, వసతిగృహం భవనం రూపుదిద్దుకోనున్నది. గ్రౌండ్ ఫ్లోర్లో 16 గదులు నిర్మాణం చేసి, గదికి 6 మంది విద్యార్థుల చొప్పున వసతి పొందనున్నారు. మొదటి అంతస్తులో 18 గదుల్లో 6 మంది విద్యార్థులు వసతి పొందేవిధంగా భవన నిర్మాణం జరుగనున్నది. రెండో అంతస్తులో 18 గదుల్లో 6 మంది విద్యార్థుల చొప్పున వసతి పొందుతూ వైద్య సేవలు అందించనున్నారు. మూడు అంతస్తుల్లో మొత్తం 322 మంది విద్యార్థులు చదువుతో పాటు వసతి పొందేందుకు ప్రభుత్వం విశాలమైన భవనాలు నిర్మిస్తున్నది.
నిర్దేశిత సమయంలో కళాశాల భవనం పూర్తి..
ప్రభుత్వం ఆదేశాల మేరకు నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులు సమయంలోగా పూర్తిచేస్తాం. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియలో ఉన్నది. టెండర్లు పూర్తికాగానే, భవన నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఖర్చు చేస్తూ నిర్దేశిత సమయానికి భవనం సిద్ధం చేస్తాం. తమ శాఖకు అప్పగించిన నర్సింగ్ కళాశాల భవన పనులు వేగవంతం చేసి త్వరగా అందుబాటులోకి తీసుకువస్తాం. – సంగారెడ్డి, పబ్లిక్ అండ్ హెల్త్ ఈఈ
దవాఖానలో క్రిటికల్ కేర్ యూనిట్..
సంగారెడ్డి జిల్లా దవాఖాన ప్రాంగణంలో వైద్య కళాశాల, దవాఖానలో విధులు నిర్వహించే నర్సుల కోసం ప్రత్యేకంగా కళాశాల, వసతి గృహం కోసం రూ.34 కోట్లను సీఎం కేసీఆర్ కేటాయించారు. ప్రభుత్వ దవాఖానలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌కు రూ.23.75 కోట్లు, రేడియాలజీకి రూ.1.38కోట్లతో అందుబాటులోకి తీసుకురానున్నారు.