సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 5: రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పటాన్‌చెరులోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమంలో లబ్ధిదారులకు జీవో 58 కింద సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు, కలెక్టర్ శరత్‌కుమార్ రానున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని జడ్పీ సర్వ సభ్య సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో కంటి వెలుగు కార్యక్రమంపై నిర్వహించే జిల్లా స్థాయి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు మొగుడంపల్లి మండలం ఉప్పర్‌పల్లి తండాలో మోతీమాతా ఆలయాన్ని మంత్రి సందర్శించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఝరాసంఘం మండలం బిడెకన్నె గ్రామ శివారులోని అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థలో వర్మీ కల్చర్ చేస్తున్న రైతులను కలిసి మాట్లాడుతారని కలెక్టర్ వివరించారు. ఈ మేరకు గురువారం జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డిలతో పాటు ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఈ నెల 6న మంత్రి హరీష్‌రావు పాల్గొననున్న కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగేలా అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
‘అరణ్య’ సంస్ధలో పలు రకల చెట్లు పెంపకం
జహీరాబాద్, జనవరి 5: ఝరాసంగం మండలంలోని బిడెకన్నె గ్రామ శివారులోని ‘అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థను పరిశీలించేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు శుక్రవారం రానున్నారు. ఇందుకోసం ఆ సంస్థ నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అరణ్య సంస్థలో చిరుధాన్యాలు, చెట్లు విత్తనాలు, కూరగాయలు, 1000 రకాల విత్తనాలు నిల్వ చేశారు. విత్తన జాతిని కాపాడేందుకు ఈ సంస్థ కృషి చేస్తున్నది. చెట్లతో వ్యవసాయం ఆనే పద్ధతిలో వారు పలు రకాల చెట్లు పెంచారు. 360 రోజులు వ్యవసాయ క్షేత్రంలో పండ్లు, చిరుధాన్యాలు ఉండేలా ప్రయత్నం చేశారు. కరువు సమయంలో పంటలు పండవని, కరువులో చెట్లు ఉంటాయని, చెట్ల నుంచి పండ్లు తిని జీవించేలా వారు కృషి చేస్తున్నారు. రైతులు నష్టాలు పోకుండా ఉండేందుకు వారు చెట్లుతో వ్యవసాయం చేస్తున్నారు. అరణ్య సంస్థ వారు చేస్తున్న ఈ వ్యవసాయాన్ని కలెక్టర్ శరత్ పరిశీలించారు.